Triumph Speed T4 350 : ట్రయంఫ్ మాస్టర్ ప్లాన్.. 350cc ఇంజన్ తో మార్కెట్లో ఇక రచ్చ రచ్చే
350cc ఇంజన్ తో మార్కెట్లో ఇక రచ్చ రచ్చే
Triumph Speed T4 350 : ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్, బజాజ్ ఆటోతో కలిసి భారత మార్కెట్లో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే 400cc విభాగంలో స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400Xలతో దుమ్మురేపుతున్న ఈ సంస్థ, ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువయ్యేందుకు 350cc వేరియంట్‌ను సిద్ధం చేస్తోంది. తాజాగా టెస్టింగ్ సమయంలో కనిపించిన Triumph Speed T4 350 మోడల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వంటి బైక్‌లకు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది.
భారతదేశంలో 350cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై జీఎస్‌టీ కేవలం 18% మాత్రమే ఉంటుంది. అదే 350cc దాటితే అది ఏకంగా 40%కి చేరుతుంది. ప్రస్తుతం ట్రయంఫ్ 400cc బైక్‌లపై భారీగా పన్ను పడుతోంది. అందుకే, ధరను భారీగా తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ట్రయంఫ్ తన ఇంజన్‌ను 350ccకి తగ్గిస్తోంది. దీనివల్ల బైక్ ధర సుమారు రూ.20,000 నుండి రూ.25,000 వరకు తగ్గే అవకాశం ఉంది. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.75 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా.
టెస్టింగ్‌లో కనిపించిన స్పీడ్ టీ4 చూడటానికి ప్రస్తుత 400cc మోడల్‌లాగే ఉంది. స్టైలింగ్, బాడీ పార్ట్స్ లేదా డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అంటే ట్రయంఫ్ తన డెవలప్‌మెంట్ ఖర్చును తగ్గించుకుంటూనే, కస్టమర్లకు ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న 398.15cc ఇంజన్‌ను కొద్దిగా రీ-వర్క్ చేసి 350cc లోపు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. పవర్ కొంచెం తగ్గినా, ట్రయంఫ్ మార్క్ పెర్ఫార్మెన్స్, మిడ్-రేంజ్ కంట్రోల్ మాత్రం అలాగే ఉంటాయని సమాచారం.
బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇప్పటికే ధృవీకరించినట్లుగా, ట్రయంఫ్ 350cc రేంజ్ బైక్‌లు ఏప్రిల్ 2026లో విడుదల కానున్నాయి. ఈ లైనప్‌లో స్పీడ్ టీ4 తో పాటు స్పీడ్ 350, స్క్రాంబ్లర్ 350 ఎక్స్ వంటి మోడళ్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ బైక్‌లు నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, క్లాసిక్ 350, హోండా CB350 RS వంటి పాపులర్ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి.
కొత్త 350cc బైక్‌లో కూడా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS), ఆల్-ఎల్ఈడీ లైటింగ్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు కొనసాగే అవకాశం ఉంది. ఛాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ లో కూడా ఎటువంటి మార్పులు లేకుండా ప్రస్తుత 400cc హార్డ్‌వేర్‌నే వాడుతున్నారు. అంటే తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీ ఉన్న బైక్ కావాలనుకునే యువతకు ట్రయంఫ్ స్పీడ్ టీ4 350 ఒక బెస్ట్ ఆప్షన్ కాబోతోంది.