TVS Ntorq 125 : కొత్త అవతారంలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125.. అదిరిపోయే కలర్స్, స్టైలిష్ లుక్ తో లాంచ్
అదిరిపోయే కలర్స్, స్టైలిష్ లుక్ తో లాంచ్
TVS Ntorq 125 : భారతదేశంలో స్పోర్టీ అండ్ పవర్‌ఫుల్ స్కూటర్ల విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సరికొత్త అవతారంలో కస్టమర్ల ముందుకు వచ్చింది. రాబోయే పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు టీవీఎస్ సంస్థ ఈ స్కూటర్ ను సరికొత్త ఆకర్షణీయమైన రంగులు, మోడ్రన్ గ్రాఫిక్స్ తో అప్‌డేట్ చేసింది. ఈ మార్పులను కంపెనీ ప్రధానంగా డిస్క్, రేస్ ఎడిషన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. స్కూటర్ బాహ్య రూపానికి సరికొత్త స్టైలిష్ లుక్ ఇచ్చినప్పటికీ, దీని ఇంజిన్ , ఇతర మెకానికల్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
రేస్ ఎడిషన్‌లో మూడు సరికొత్త రంగులు
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ ను ఇష్టపడే వారి కోసం కంపెనీ మూడు సరికొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. ఇందులో డ్రిఫ్ట్ బ్లూ, ఇన్‌ఫెర్నో రెడ్, రష్ గ్రీన్ రంగులు ఉన్నాయి. ఈ కొత్త కలర్స్ కి మరింత స్పోర్టీ లుక్ జోడించడం కోసం స్కూటర్ బాడీ కలర్ కి మ్యాచ్ అయ్యేలా అల్లాయ్ వీల్స్ ను కూడా రంగులతో డిజైన్ చేశారు. టీవీఎస్ రేసింగ్ బైక్స్ ప్రేరణతో ఈ రంగులను సిద్ధం చేశామని, దీనిపై ఉన్న షార్ప్ గ్రాఫిక్స్ స్కూటర్ ను మునుపటి కంటే చాలా అగ్రెసివ్ గా చూపిస్తాయని కంపెనీ పేర్కొంది.
డిస్క్ వేరియంట్ లోనూ కొత్త ఆప్షన్లు
రేస్ ఎడిషన్ తో పాటు ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ లో కూడా కంపెనీ రెండు సరికొత్త కలర్ ఆప్షన్లను యాడ్ చేసింది. ఇప్పుడు కస్టమర్లు ఈ వేరియంట్ ను మిడ్‌నైట్ బ్లాక్ , స్పితి వైట్ రంగుల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల కస్టమర్లకు నచ్చిన కలర్ ఎంచుకునేందుకు ఎక్కువ ఆప్షన్లు లభిస్తాయి. వీటితో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న నార్డో గ్రే కలర్ మోడల్ ను కూడా కంపెనీ సరికొత్తగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ గ్రే కలర్ లో మార్పు చేయనప్పటికీ, దీనిపై ఉన్న గ్రాఫిక్స్ ను మరింత షార్ప్ గా, ఆకర్షణీయంగా మార్చారు.
ఫీచర్లు, నమ్మకమైన ఇంజిన్
ఈ సరికొత్త అప్‌డేట్‌లో కంపెనీ కేవలం స్టైలింగ్ పైనే దృష్టి పెట్టింది. ఫీచర్ల విషయానికి వస్తే పాత మోడల్ లో ఉన్న అడ్వాన్స్‌డ్ ఫీచర్లనే ఇందులోనూ కొనసాగించారు. ఈ స్కూటర్ లో ప్రసిద్ధ టీవీఎస్ స్మార్ట్ ఎక్స్‌కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది, దీని ద్వారా మొబైల్ ను స్కూటర్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్లీ డిజిటల్ రివర్స్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ను ఇప్పుడు ఎన్‌టార్క్ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఫీచర్ గా ఇస్తున్నారు. ఇంజిన్ పరంగా చూస్తే, ఇందులో నమ్మకమైన 124.8cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను ఉపయోగించారు. పవర్, పర్ఫార్మెన్స్ లో ఎలాంటి మార్పులు లేవు.
ధర, లభ్యత వివరాలు
భారత మార్కెట్లో కొత్త మార్పులతో వచ్చిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 82,500 గా నిర్ణయించారు. అదేవిధంగా, టాప్ ఎండ్ మోడల్ అయిన రేస్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 87,950 గా ఉంది. ఈ రెండు సరికొత్త వేరియంట్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ అధికారిక డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల కస్టమర్లు తమకు నచ్చిన కలర్ మోడల్ ను షోరూమ్‌కి వెళ్లి బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.