Hybrid SUVs : ఎస్‌యూవీ ప్రియులకు పండగే.. త్వరలో మార్కెట్లోకి 4 కొత్త 7-సీటర్ హైబ్రిడ్ కార్లు
త్వరలో మార్కెట్లోకి 4 కొత్త 7-సీటర్ హైబ్రిడ్ కార్లు
Hybrid SUVs : సాధారణంగా పెద్ద 7-సీటర్ ఎస్‌యూవీ అంటేనే మనకు డీజిల్ ఇంజిన్లు గుర్తొస్తాయి. కానీ మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న వేళ, మైలేజీతో పాటు పవర్‌ను ఇచ్చే హైబ్రిడ్ కార్లకు ఇప్పుడు గిరాకీ పెరుగుతోంది. అందుకే ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రాబోయే రోజుల్లో పవర్ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్లతో కూడిన 7-సీటర్ ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
జెటూర్ టి2 ప్లగ్-ఇన్ హైబ్రిడ్
జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ సహకారంతో భారత మార్కెట్లోకి రానున్న మొదటి 7-సీటర్ ఎస్‌యూవీ జెటూర్ టి2. ఈ ఏడాది దీపావళి సీజన్‌లో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే దీనిలోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు తోడు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 26.7 kWh బ్యాటరీ ఉంటాయి. ఇది ఏకంగా 375 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 139 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని ధర సుమారు రూ.20-30 లక్షల మధ్య ఉండొచ్చు.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 7-సీటర్
టయోటా నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైరైడర్ 7-సీటర్ వెర్షన్ ఈ ఏడాది చివరలో మార్కెట్లోకి రానుంది. ఇటీవలే దీని టెస్ట్ మోడల్ రోడ్లపై కనిపించింది. ఇది ప్రస్తుత 5-సీటర్ మోడల్ కంటే పొడవుగా ఉండి, మూడో వరుస సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉంటుంది, ఇది 116 bhp పవర్‌ను ఇస్తుంది. దీని ధర సుమారు రూ.18-22 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
రెనాల్ట్ బోరియల్
రెనాల్ట్ డస్టర్ అంటే తెలియని వారుండరు. ఆ డస్టర్ కి 7-సీటర్ వెర్షనే ఈ బోరియల్. ఇది ఈ ఏడాది ఆఖరిలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది సుమారు 160 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇది నేరుగా హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారి వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధర రూ.18-25 లక్షల మధ్య ఉండవచ్చు.
నిస్సాన్ టెక్టాన్ 7-సీటర్
నిస్సాన్ కంపెనీ కూడా తన టెక్టాన్ ఎస్‌యూవీని 7-సీటర్ రూపంలో తీసుకురాబోతోంది. ఇది రెనాల్ట్ బోరల్ కు సమానమైన ఫీచర్లు, ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కూడా అదే 1.8 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. లుక్ పరంగా నిస్సాన్ సిగ్నేచర్ స్టైలింగ్‌తో ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. దీని ధర కూడా రూ.18-25 లక్షల రేంజ్‌లో ఉండబోతోంది. మధ్యతరగతి కుటుంబాలకు ఈ కార్లు మంచి ఆప్షన్ కానున్నాయి.