Upcoming Bikes : బైక్ లవర్స్‌కు పండగే.. మార్కెట్‌లోకి రాబోతున్న 5 పవర్‌ఫుల్ బైకులు
మార్కెట్‌లోకి రాబోతున్న 5 పవర్‌ఫుల్ బైకులు
Upcoming Bikes : భారతీయ రోడ్లపై త్వరలోనే పవర్ఫుల్ ఇంజిన్ల గర్జన వినిపించబోతోంది. మీరు కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కొద్దిరోజులు ఆగాల్సిందే.ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకుల నుంచి భారీ ట్విన్-సిలిండర్ మెషీన్ల వరకు సరికొత్త బైకులు మార్కెట్లోకి దూసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు దిగ్గజ కంపెనీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750
అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఉన్న హిమాలయన్ కంటే ఎంతో శక్తివంతమైన హిమాలయన్ 750ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో 750 సీసీ పారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చబోతున్నారు. ఇది సుమారు 55 బిహెచ్‌పి పవర్, 60 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లాంగ్ రైడ్స్ చేసేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ మెషీన్ కానుంది. దీని ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్
బీఎండబ్ల్యూ తన అత్యంత చిన్న అడ్వెంచర్ బైక్‌ను మార్కెట్లోకి తెస్తోంది. టీవీఎస్ కంపెనీతో కలిసి భారత్‌లోనే తయారవుతున్న ఈ బైక్, ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. పెద్ద జీఎస్ మోడళ్ల డిజైన్‌తో వచ్చే ఈ బైక్‌లో 420 సీసీ పారలల్-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 48 బిహెచ్‌పి పవర్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.4.5 లక్షల వరకు ఉండొచ్చు.
యేజ్డీ స్క్రాంబ్లర్ ఫేస్‌లిఫ్ట్
యేజ్డీ తన పాపులర్ స్క్రాంబ్లర్ బైక్‌ను కొత్త హంగులతో ఏప్రిల్ 23, 2026న లాంచ్ చేయబోతోంది. ఇందులో మేజర్ గా సస్పెన్షన్ మార్పులు, సరికొత్త రంగులను పరిచయం చేస్తున్నారు. 334 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్, సిటీ రైడింగ్ కి, ఆఫ్-రోడింగ్ కి రెండింటికీ అనువుగా ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ అంటేనే క్లాసిక్. ఇప్పుడు ఈ ఐకానిక్ డిజైన్‌కు 650 సీసీ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను జత చేయబోతున్నారు. అంటే బుల్లెట్ రాయల్టీతో పాటు సూపర్ బైక్ పవర్ లభిస్తుందన్నమాట. ఇది సుమారు 46 బిహెచ్‌పి పవర్ ఇస్తుంది. దీని ధర రూ.3.4 లక్షల నుంచి రూ.3.6 లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉంది. పాతకాలపు లుక్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ట్రయంఫ్ బోన్విల్లే 400
ట్రయంఫ్ కంపెనీ కూడా తక్కువ బడ్జెట్‌లో తన క్లాసిక్ మోడల్‌ను తెస్తోంది. స్పీడ్ 400 కంటే భిన్నంగా, ఇది రెట్రో డిజైన్‌తో, స్పోక్ వీల్స్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌తో రాబోతోంది. ఇందులో 398 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ప్రీమియం రెట్రో బైక్ కొనాలనుకునే వారికి ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.