Upcoming SUVs : ఎస్‌యూవీ లవర్స్‌కు పండగే.. త్వరలోనే మార్కెట్లోకి 5 పవర్‌ఫుల్ స్పోర్టీ ఎస్‌యూవీలు
త్వరలోనే మార్కెట్లోకి 5 పవర్‌ఫుల్ స్పోర్టీ ఎస్‌యూవీలు
Upcoming SUVs : భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ రోజురోజుకూ ఆకాశాన్నంటుతోంది. ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లు ఎక్కువగా కొనేవారు సైతం.. ఇప్పుడు మైక్రో ఎస్‌యూవీలు, సబ్-4 మీటర్ ఎస్‌యూవీలు, మిడ్-సైజ్ ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్ల ఇంట్రెస్ట్‌కు తగ్గట్టుగానే దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ వాహన తయారీ కంపెనీలు సరికొత్త ఎస్‌యూవీలను పరిచయం చేయడంపైనే పూర్తి ఫోకస్ పెట్టాయి. ఒకవేళ మీరు కూడా త్వరలోనే ఒక పవర్‌ఫుల్, స్పోర్టీ లుక్ ఉన్న ఎస్‌యూవీ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే.. అతి త్వరలోనే భారత మార్కెట్లో లాంచ్ కాబోతున్న 5 అదిరిపోయే సరికొత్త ఎస్‌యూవీల వివరాలు తెలుసుకుందాం.
1. స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్
ప్రస్తుతం భారత మార్కెట్లో స్కోడా కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కైలాక్. కంఫర్ట్, పర్ఫార్మెన్స్, లుక్స్ పరంగా అదరగొడుతున్న ఈ కారు.. లాంచ్ అయిన కేవలం ఏడాది కాలంలోనే 50,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ భారీ సక్సెస్‌ను కొనసాగిస్తూ, స్కోడా కంపెనీ ఈ ఏడాది ఈ కారుకు సంబంధించిన స్పోర్ట్‌లైన్ వెర్షన్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త వేరియంట్ అంతటా బ్లాక్ కలర్ ఎలిమెంట్స్‌తో కంప్లీట్ స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే అదే 1.0 లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను వాడనున్నారు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
2. స్కోడా కోడియాక్ ఆర్ఎస్
స్కోడా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి తన పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కోడియాక్ ఆర్ఎస్ మోడల్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రత్యేకమైన ఆర్ఎస్ (RS) వేరియంట్‌లో సాధారణ క్రోమ్ ఫినిషింగ్‌కు బదులుగా.. ఆర్ఎస్ బంపర్, గ్రిల్, కారు చుట్టూ గ్లోస్-బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. కారు లోపలి భాగం కూడా ఆల్-బ్లాక్ థీమ్‌తో, అక్కడక్కడా రెడ్ కలర్ యాక్సెంట్స్, ఆర్ఎస్ బ్యాడ్జింగ్‌తో సూపర్ స్పోర్టీగా ఉంటుంది. ఇందులో ఆర్ఎస్-స్పోర్ట్స్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో ఏకంగా 263 పీఎస్ పవర్, 370 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేసే పవర్‌ఫుల్ 2.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నారు.
3. నిస్సాన్ టెక్టాన్
నిస్సాన్ కంపెనీ 2026 జూలై 9వ తేదీన తన సరికొత్త టెక్టాన్ ఎస్‌యూవీని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ కారు బాహ్య డిజైన్ ప్రముఖ డస్టర్ కారు కంటే పూర్తిగా భిన్నంగా ఉంటూ.. నిస్సాన్ పెట్రోల్ లగ్జరీ ఎస్‌యూవీని పోలి ఉంటుంది. కారు బయటి లుక్ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ, లోపలి కేబిన్, ఫీచర్లు మాత్రం డస్టర్ కారు లాగే ఉండబోతున్నాయి. ఇందులో 163 పీఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చే 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఇది మాన్యువల్, 6-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అంతేకాకుండా, ఈ కారును 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడా లాంచ్ చేయనున్నారు. ఆ తర్వాత కాలంలో ఇందులో 1.8 లీటర్ పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది.
4. టాటా సియెర్రా ఈవీ
టాటా మోటార్స్ రాబోయే కొద్ది నెలల్లోనే తన మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సియెర్రా ఈవీని మార్కెట్లోకి తీసుకురావడానికి శరవేగంగా పనిచేస్తోంది. ఈ కారు కంప్లీట్ ఎలక్ట్రిక్ (EV) ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించబడుతున్నప్పటికీ, దీని బాహ్య డిజైన్ మాత్రం పాత ఐసీఈ వెర్షన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఉంటుంది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేర్ వీల్ డ్రైవ్ (RWD), ఆఫ్-రోడింగ్ కోసం ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్లలో రాబోతోంది. కస్టమర్ల అవసరాల కోసం ఇందులో 65 కిలోవాట్-అవర్ (kWh), 75 కిలోవాట్-అవర్ సామర్థ్యం గల రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను టాటా ఆఫర్ చేయనుంది.
5. టాటా అవిన్యా ఎక్స్
రీసెంట్‌గా జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా తన అవిన్యా ఎక్స్ కాన్సెప్ట్ సరికొత్త వేరియంట్‌ను ప్రదర్శించింది. అవినా అనేది టాటా మోటార్స్ నుండి రాబోతున్న సరికొత్త లగ్జరీ బ్రాండ్. దీని కింద వచ్చే ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి కంపెనీ ప్రత్యేకమైన సరికొత్త సేల్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయబోతోంది. టాటా అవిన్యా ఎక్స్ అనేది ఒక అల్ట్రా ప్రీమియం ఎస్‌యూవీ, ఇది 5, 6, 7 సీటర్ల ఆప్షన్లలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దాదాపు ఐదు మీటర్ల పొడవు ఉండే ఈ లగ్జరీ కారులో.. ప్రస్తుతం ఉన్న టాటా మోడళ్ల కంటే ఎన్నో రెట్లు అత్యంత అధునాతనమైన, మునుపెన్నడూ చూడని హైటెక్ ఫీచర్లు ఉండబోతున్నాయి.