Upcoming Cars : నిస్సాన్ టెక్టాన్ నుంచి టాటా సియెర్రా ఈవీ వరకు..భారత రోడ్లపై 5 కొత్త ఎస్‌యూవీల జాతర

భారత రోడ్లపై 5 కొత్త ఎస్‌యూవీల జాతర

Update: 2026-04-21 17:13 GMT

Upcoming Cars : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు మిడ్-సైజ్ ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా 2026లో దేశీయ రోడ్లపైకి 5 శక్తివంతమైన కొత్త ఎస్‌యూవీలు రాబోతున్నాయి. నిస్సాన్, టాటా, మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలు తమ సరికొత్త మోడళ్లతో మార్కెట్‌ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లు కూడా ఉండటం విశేషం.

1. నిస్సాన్ టెక్టాన్

నిస్సాన్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే టెక్టాన్ చిత్రాలను విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించింది. కొత్త రెనో డస్టర్ తరహాలోనే ఆర్‌జీఎంపీ ఆర్కిటెక్చర్‌పై ఈ కారు రూపొందుతోంది. ఇందులో 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండబోతున్నాయి. వీటితో పాటు హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా నిస్సాన్ ఇచ్చే అవకాశం ఉంది. 2026 మధ్య నాటికి ఈ కారు భారత రోడ్లపై గర్జించనుంది. దీని లుక్ చాలా బోల్డ్ గా, ఫ్యూచరిస్టిక్ గా ఉండబోతోంది.

2. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా

మారుతి సుజుకి ఈ-విటారాకు సోదరి వంటి కారుగా టయోటా ఎబెల్లా మార్కెట్లోకి రాబోతోంది. ఇది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇందులో 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ధీమాగా చెబుతోంది. టెస్లా వంటి కార్లకు పోటీగా, తక్కువ ధరలో ప్రీమియం ఈవీ అనుభూతిని ఇవ్వడానికి టయోటా ఈ కారును సిద్ధం చేస్తోంది.

3. మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్

ఇప్పటికే మార్కెట్లో రారాజుగా ఉన్న స్కార్పియో ఎన్, ఇప్పుడు సరికొత్త హంగులతో రాబోతోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రధాన మార్పు ఇంటీరియర్. పాత 8 అంగుళాల స్క్రీన్ స్థానంలో భారీ 12.3 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ రాబోతోంది. డ్రైవర్ కోసం 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బయటి వైపు కొత్త డిజైన్ గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ లైట్లు ఈ కారుకు మరింత రాజసాన్ని తెచ్చిపెట్టనున్నాయి.

4. స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్

స్కోడా ప్రియుల కోసం 2026 చివరలో కైలాక్ స్పోర్ట్‌లైన్ ఎడిషన్ రాబోతోంది. సాధారణ కైలాక్ కంటే ఇది చాలా స్పోర్టీగా, అగ్రెసివ్ లుక్‌తో ఉంటుంది. యువతను ఆకట్టుకోవడానికి బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్, కొత్త అల్లాయ్ వీల్స్, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఫీచర్లను ఇందులో జోడిస్తున్నారు. స్పీడ్, స్టైల్ రెండూ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

5. టాటా సియెర్రా ఈవీ

తొంభైల కాలం నాటి ఐకానిక్ బ్రాండ్ సియెర్రాను టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ అవతారంలో మళ్లీ తెస్తోంది. హారియర్ ఈవీ కంటే కొంచెం తక్కువ కేటగిరీలో ఇది ఉండబోతోంది. పాత సియెర్రా సిగ్నేచర్ గ్లాస్ రూఫ్ రూపాన్ని అలాగే ఉంచుతూనే, క్లోజ్డ్ గ్రిల్, ఎల్‌ఈడీ లైట్ బార్ వంటి మోడ్రన్ ఫీచర్లతో ఈ కారు మెరవనుంది. 2026 జూన్ లేదా జూలై నాటికి దీని లాంచ్ ఉండవచ్చు. ఇది టాటా ఈవీ లైనప్‌లో మోస్ట్ స్టైలిష్ కారుగా నిలవబోతోంది.

Tags:    

Similar News