Upcoming SUVs : 2026లో ఎస్‌యూవీల జాతర..13 కొత్త మోడళ్లతో మార్కెట్ షేక్ అవ్వాల్సిందే!

13 కొత్త మోడళ్లతో మార్కెట్ షేక్ అవ్వాల్సిందే!

Update: 2025-12-29 07:36 GMT

Upcoming SUVs : ఆటోమొబైల్ లవర్స్‎కు 2026 ఒక పండగలా మారబోతోంది. వచ్చే ఏడాది భారత మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగనుంది. మారుతి సుజుకి నుంచి మహీంద్రా వరకు దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలు తమ కొత్త మోడళ్లను లేదా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. కేవలం డిజైన్ మాత్రమే కాదు.. ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్లతో రాబోతున్న ఈ 13 ఎస్‌యూవీల పూర్తి లిస్ట్ చూద్దాం.

మహీంద్రా, కియా నుంచి అదిరిపోయే ఎంట్రీ

కొత్త ఏడాది ఆరంభంలోనే మహీంద్రా నుంచి XUV 7XO రాబోతోంది. జనవరి 5న లాంచ్ కానున్న ఈ కారు XUV 700కి అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. అలాగే కియా మోటార్స్ తన సెకండ్ జనరేషన్ సెల్టోస్ ధరలను జనవరి 2నే ప్రకటించనుంది. ఇది గ్లోబల్ మోడల్ టెల్లూరైడ్ తరహాలో సరికొత్త లుక్‌తో రానుంది. అంతేకాదు వచ్చే ఏడాది చివర్లో కియా నుంచి సోరెంటో హైబ్రిడ్ కూడా ఇండియాలోకి అడుగుపెట్టనుంది.

డస్టర్ రీ-ఎంట్రీ, నిస్సాన్ మ్యాజిక్

చాలా కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ జనవరి 26న కొత్త అవతారంలో రాబోతోంది. యూరోపియన్ స్టైలింగ్, రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది ఉండబోతోంది. దీనికి తోడు నిస్సాన్ నుంచి టెక్టాన్ అనే మిడ్‌సైజ్ ఎస్‌యూవీ ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ రెండు కార్ల నుంచి భవిష్యత్తులో 7-సీటర్ వేరియంట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్, విజన్ ఎస్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న బేబీ స్కార్పియో ఎన్ కూడా 2026 చివర్లో సందడి చేయనున్నాయి.

టాటా, మారుతి సుజుకి హవా

టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ పంచ్ ఫేస్‌లిఫ్ట్‎ను 2026 ప్రారంభంలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో సరికొత్త డ్యాష్‌బోర్డ్, ఫీచర్లు ఉండబోతున్నాయి. దీనితో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రాబోతున్న హారియర్, సఫారీ పెట్రోల్ వెర్షన్ల ధరలను కూడా అప్పుడే ప్రకటించనున్నారు. అటు మారుతి సుజుకి కూడా తగ్గకుండా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో కొత్తగా అండర్ బాడీ సీఎన్‌జీ ట్యాంక్ రాబోతుండటం విశేషం. దీనివల్ల డిక్కీలో స్పేస్ అస్సలు తగ్గదు.

స్కోడా, ఫాక్స్‌వ్యాగన్ జోరు

యూరోపియన్ కార్లను ఇష్టపడే వారి కోసం స్కోడా కుషాక్, ఫాక్స్‌వ్యాగన్ తైగూన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు రాబోతున్నాయి. వచ్చే మూడు నెలల్లోనే వీటిని కొత్త హంగులతో మార్కెట్లో ప్రవేశపెడతారు. వీటిలో కాస్మెటిక్ మార్పులతో పాటు మరిన్ని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లను జోడిస్తున్నారు. మొత్తానికి 2026లో ఏ బడ్జెట్‌లో కారు కొనాలనుకున్నా సరే.. కస్టమర్ల ముందు బోలెడన్ని ఆప్షన్లు ఉండబోతున్నాయి.

Tags:    

Similar News