VinFast Limo Green EV : భారత రోడ్లపైకి విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ.. 7 సీటర్ సెగ్మెంట్‌లో కొత్త సంచలనం
7 సీటర్ సెగ్మెంట్‌లో కొత్త సంచలనం
VinFast Limo Green EV : పెద్ద ఫ్యామిలీ కోసం మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీరు మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లోకి తన మూడవ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ పేరుతో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఫ్యామిలీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. VF6, VF7 మోడల్స్ తర్వాత భారత్‌లో విన్‌ఫాస్ట్ నుంచి వస్తున్న కీలక మోడల్ ఇదే. తమిళనాడులోని తయారీ కేంద్రం నుంచి ఈ కార్లు ఉత్పత్తి కానున్నాయి.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ కారులో 60.13 kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అమర్చారు. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 204 bhp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇది కేవలం పవర్‌ఫుల్ మాత్రమే కాదు, రేంజ్ విషయంలోనూ అదరగొడుతోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 450 కిలోమీటర్ల దూరం (NEDC) ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఇవి మీ అవసరానికి తగ్గట్టుగా పవర్‌ను అడ్జస్ట్ చేస్తాయి.
చార్జింగ్ సమయం విషయంలో విన్‌ఫాస్ట్ విప్లవాత్మక మార్పులు చేస్తోంది. 80 kW DC ఫాస్ట్ చార్జర్‌ను ఉపయోగిస్తే, కేవలం 30 నిమిషాల్లోనే ఈ కారు బ్యాటరీ 10 నుండి 70 శాతానికి చేరుకుంటుంది. అంటే మీరు కాఫీ తాగే లోపు కారు లాంగ్ జర్నీకి సిద్ధమైపోతుంది. అలాగే ఇంట్లో చార్జ్ చేసుకోవడానికి 11 kW AC చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ప్రయాణాల్లో చార్జింగ్ టెన్షన్ అస్సలు ఉండదు.
ఈ ఎంపీవీ పొడవు 4,740 మి.మీ, వెడల్పు 1,872 మి.మీ, ఎత్తు 1,728 మి.మీ ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,840 మి.మీ కావడం వల్ల లోపల స్థలం చాలా ధారాళంగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీగా ఉండటం వల్ల భారతీయ రోడ్లపై ఈజీగా ప్రయాణించవచ్చు. ఈ కారు లిమో గ్రీన్ మాత్రమే కాకుండా.. లిమో ఎల్లో, సిల్వర్, బ్లాక్, రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కారు లోపలి భాగం చాలా లగ్జరీగా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం హెడ్-అప్ డిస్‌ప్లే (HUD) ప్రధాన ఆకర్షణలు. ఇది 7-సీటర్ (2+3+2) కాన్ఫిగరేషన్‌తో వస్తోంది. రెండో వరుసలో స్లైడింగ్ బెంచ్ సీట్లు ఉండటం వల్ల కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 18 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.