VinFast : పెట్రోల్ కార్లు అమ్మేసి ఎలక్ట్రిక్ కారు కొనండి.. విన్‌ఫాస్ట్ నుంచి అదిరిపోయే డిస్కౌంట్

విన్‌ఫాస్ట్ నుంచి అదిరిపోయే డిస్కౌంట్

Update: 2026-03-17 09:25 GMT

VinFast : వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారతీయ మార్కెట్లో తన పట్టును పెంచుకునేందుకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. భారతదేశంతో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లోని తమ వినియోగదారులకు మార్చి 31, 2029 వరకు పూర్తి ఉచితంగా ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనివల్ల విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన వారు తమ కార్లను వి-గ్రీన్ ఛార్జింగ్ స్టేషన్లలో ఉచితంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్రయోజనం కేవలం కొత్త కస్టమర్లకే కాకుండా, ఇప్పటికే విన్‌ఫాస్ట్ కార్లను వాడుతున్న వారికి కూడా వర్తిస్తుంది.

విన్‌ఫాస్ట్ పేరెంట్ కంపెనీ అయిన విన్‌గ్రూప్ మరో ఆకర్షణీయమైన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అదే ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్. దీని ఉద్దేశ్యం ఏంటంటే.. ప్రజలు తమ పాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను వదిలి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించడం. ఈ పథకం కింద పాత పెట్రోల్ వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసి విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారు కొంటే 3 శాతం, ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే 5 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ మార్చి 11 నుంచి మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ సదుపాయం కేవలం వ్యక్తిగత వినియోగదారులకే కాకుండా, కమర్షియల్ రంగంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా గ్రీన్ ఎస్ఎం నెట్‌వర్క్ కింద పనిచేసే ఎలక్ట్రిక్ టాక్సీ డ్రైవర్లు కూడా ఈ ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల వాహన నిర్వహణ ఖర్చు దాదాపు సున్నాకి చేరుకుంటుంది. ఇండోనేషియా, లావోస్, వియత్నాం దేశాల్లో గ్రీన్ ఎస్ఎం టాక్సీ సేవలను ఉపయోగించే ప్రయాణికులకు కూడా 10 శాతం వరకు రాయితీని కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, వినియోగదారులపై ఆ భారాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని విన్‌ఫాస్ట్ గ్లోబల్ సేల్స్ డిప్యూటీ సీఈఓ డుయోంగ్ థి థు ట్రాంగ్ తెలిపారు. ఈ భారీ ఆఫర్ల ద్వారా పెట్రోల్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణహితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే భారతదేశంలో హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలతో జతకట్టి దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను విన్‌ఫాస్ట్ వేగంగా విస్తరిస్తోంది.

Tags:    

Similar News