VinFast : భారత కార్ మార్కెట్‌లోకి విన్ ఫాస్ట్ సెన్సేషన్.. ఏప్రిల్ 15న ఫ్యామిలీ ప్యాక్ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్

ఏప్రిల్ 15న ఫ్యామిలీ ప్యాక్ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్

Update: 2026-04-02 09:30 GMT

VinFast : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టిస్తున్న వియత్నాం కంపెనీ విన్‎ఫాస్ట్ , ఇప్పుడు భారత మార్కెట్‌పై కన్నేసింది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, తన సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ MPVని విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 15న ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ లోపే కారును సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం కంపెనీ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేసింది.

బుకింగ్ వివరాలు, లభ్యత

కొత్త కారు కావాలనుకునే వారు కేవలం రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 50 విన్‎ఫాస్ట్ షోరూమ్‌లలో కానీ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తపన్ కుమార్ ఘోష్ స్వయంగా వెల్లడిస్తూ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బుకింగ్ ప్రక్రియను సరళతరం చేశామని తెలిపారు. అయితే, ఈ కారు అసలు ధర ఎంత అన్నది మాత్రం ఏప్రిల్ 15న లాంచ్ రోజే ప్రకటించనున్నారు.

డిజైన్ లో గోల్డెన్ రేషియో మ్యాజిక్

ఈ 7-సీటర్ MPVని విన్‎ఫాస్ట్ చాలా ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో గోల్డెన్ రేషియో డిజైన్ ఫిలాసఫీని వాడారు. అంటే, కారు బయట నుంచి చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, లోపల ప్రయాణికులకు అత్యధిక స్థలం లభిస్తుంది. కారు టైర్లను మూలలకు జరపడం ద్వారా కేబిన్ లోపల కాలు చాపుకోవడానికి ఎక్కువ ప్లేస్ దొరుకుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలకు, లాంగ్ జర్నీలు చేసే వారికి ఈ కారు ఒక లగ్జరీ ఫీలింగ్‌ను అందిస్తుంది. మూడు వరుసల్లో కూర్చునే వారందరికీ సమానమైన సౌకర్యం దక్కేలా సీట్ల అమరిక ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యం, రేంజ్

ఈ ఎలక్ట్రిక్ MPVలో 60.13 kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అమర్చారు. దీనివల్ల ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. అంటే సిటీలో ఆఫీస్ పనులకే కాకుండా, వారాంతాల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ట్రిప్పులకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రేంజ్ విషయంలో ప్రస్తుత మార్కెట్లో ఉన్న ఇతర కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

మార్కెట్లో పోటీ ఎలా ఉండబోతోంది?

ప్రస్తుతం విన్‎ఫాస్ట్ లైనప్‌లో VF6, VF7 వంటి మోడల్స్ ఉన్నప్పటికీ, ఈ కొత్త MPV భారత్‌లో గేమ్ ఛేంజర్ కానుంది. ఇది మార్కెట్లోకి వస్తే కియా కారెన్స్ క్లావిస్ EV (Kia Carens Clavis EV), BYD eMax 7 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా 7-సీటర్ ఎలక్ట్రిక్ విభాగంలో ఎంపికలు తక్కువగా ఉన్న తరుణంలో విన్‎ఫాస్ట్ ఎంట్రీ వినియోగదారులకు మంచి ప్రత్యామ్నాయం కానుంది.

Tags:    

Similar News