VinFast VF5 EV : 326 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్స్.. ఇండియాలోకి విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ కారు

ఇండియాలోకి విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ కారు

Update: 2026-03-03 09:57 GMT

VinFast VF5 EV : భారతదేశ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ ఆధిపత్యానికి గట్టి పోటీ ఇచ్చేందుకు వియత్నాం దిగ్గజం విన్‌ఫాస్ట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే తమిళనాడులో తన ప్లాంట్‌ పనులను వేగవంతం చేసిన ఈ కంపెనీ, త్వరలోనే బడ్జెట్ ధరలో VF5 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది మార్కెట్లోకి వస్తే టాటా టయాగో ఈవీ, టాటా పంచ్ ఈవీల అమ్మకాలకు భారీ గండం తప్పదని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే సక్సెస్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకున్న ఈ కారు, ఇప్పుడు ఇండియాలో రచ్చ చేసేందుకు రెడీ అవుతోంది.

డిజైన్ విషయానికి వస్తే.. విన్‌ఫాస్ట్ VF5 చూడటానికి ఒక చిన్న ఎస్‌యూవీలా కనిపిస్తుంది. దీని పొడవు 3967 మిమీ, అంటే ఇది టాటా పంచ్ ఈవీ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. దీని 2514 మిమీ వీల్‌బేస్ వల్ల లోపల ప్రయాణికులకు మంచి స్పేస్ లభిస్తుంది. 17 ఇంచుల స్టైలిష్ అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ లైటింగ్, విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. కారు వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా బూట్ స్పేస్‌ను ఏకంగా 900 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. భారతీయ రోడ్లకు అనుగుణంగా దీని గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా కంపెనీ పెంచే అవకాశం ఉంది.

కారు ఇంటీరియర్ చాలా మోడ్రన్‌గా ఉంటుంది. మొత్తం బ్లాక్ కలర్ థీమ్‌తో కూడిన క్యాబిన్ ప్రయాణికులకు విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. ఇందులో 8 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వాయిస్ కమాండ్ సపోర్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు PM 2.5 ఎయిర్ ఫిల్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చెప్పాలంటే, తక్కువ ధరలోనే ఒక హైటెక్ కారును వినియోగదారులకు అందించాలని విన్‌ఫాస్ట్ భావిస్తోంది.

బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే.. VF5 రెండు రకాల ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకటి 29.6 kWh బ్యాటరీతో 268 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, మరొకటి 37.23 kWh బ్యాటరీతో ఏకంగా 326 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. కేవలం 33 నిమిషాల్లోనే 10 నుంచి 70 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. దీని పవర్‌ఫుల్ మోటార్ వల్ల కేవలం 11 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో, మంచి మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ కానుంది.

Tags:    

Similar News