Volkswagen: బ్రెజ్జా, నెక్సాన్‌లకు చెక్ పెట్టేలా ఫోక్స్ వ్యాగన్ నుంచి సరికొత్త ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
లాంచ్ ఎప్పుడంటే?
Volkswagen: దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న 4-మీటర్ల కంటే తక్కువ పొడవుండే ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన జెండా పాతేందుకు ఫోక్స్‌వ్యాగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. బ్రెజిల్ మార్కెట్‌లో విశేష ఆదరణ పొందిన ఫోక్స్‌వ్యాగన్ టెరా మోడల్ ఆధారంగా ఈ కొత్త కారు రూపుదిద్దుకుంటోంది. బ్రెజిల్ వెర్షన్ 4.15 మీటర్ల పొడవు ఉన్నప్పటికీ, మన దేశంలో పన్ను మినహాయింపుల నిబంధనలకు అనుగుణంగా దీని పొడవును 4 మీటర్ల కంటే తక్కువగానే తయారుచేస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా సన్నని ఎల్‌ఈడీ హెడ్‌లాంప్‌లు, కనెక్టెడ్ లైట్ స్ట్రిప్, రూఫ్ రైల్స్, స్పోర్టీ బంపర్‌తో ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు.
కళ్లు చెదిరే ఇంటీరియర్.. అత్యాధునిక ఫీచర్లు
అంతర్గత నిర్మాణం, ఫీచర్ల విషయంలో ఈ కొత్త కారు స్కోడా కైలాక్ మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. కారు క్యాబిన్‌లో 10 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ ఏసీ, సన్‌రూఫ్ వంటి అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. సుదీర్ఘ ప్రయాణాలను అత్యంత సౌకర్యవంతంగా మార్చేందుకు వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు అమర్చనున్నారు. యంగ్ రైడర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక బ్యాడ్జింగ్, విభిన్న డిజైన్ ఎలిమెంట్లతో జీటీ వేరియంట్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చే యోచనలో ఉంది.
పవర్ఫుల్ టర్బో ఇంజిన్ సపోర్ట్
ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి మెరుగైన పవర్ అందించేందుకు స్కోడా కైలాక్‌లో వాడే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌నే ఉపయోగించనున్నారు. గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే 6-స్పీడ్ మాన్యువల్, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. జర్మన్ ఇంజనీరింగ్ నాణ్యత, పవర్‌ఫుల్ ఇంజిన్, అత్యాధునిక ఫీచర్ల కలయికగా రాబోతున్న ఈ కారు మధ్యతరగతి కుటుంబాలకు ఒక అద్భుతమైన ఎంపికగా మారనుంది.
అందుబాటు ధరలోనే లగ్జరీ రైడ్
సందడి చేయనున్న ఈ నూతన ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, భద్రతా ప్రమాణాలు అందించడం ద్వారా నెక్సాన్, బ్రెజ్జా, సోనెట్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వినియోగదారులను తనవైపు తిప్పుకోవాలని కంపెనీ భావిస్తోంది. స్కోడా భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ భారత ఆటో పరిశ్రమలో సరికొత్త సంచలనానికి బాటలు వేయనుంది.