Taigun vs Kushaq : జర్మన్ టెక్నాలజీ.. అదిరిపోయే సేఫ్టీ.. టైగూన్ వర్సెస్ కుషాక్.. ఏది బెస్ట్ ?
అదిరిపోయే సేఫ్టీ.. టైగూన్ వర్సెస్ కుషాక్.. ఏది బెస్ట్ ?
Taigun vs Kushaq : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్ ఇప్పుడు హీటెక్కుతోంది. ముఖ్యంగా ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తయారైనప్పటికీ, తమదైన శైలిలో విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్న రెండు కార్లు – ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్, స్కోడా కుషాక్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కొత్త కారు కొనాలనుకునే వారు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని తలలు పట్టుకుంటున్నారు.
డిజైన్, లుక్స్
ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మరింత మోడ్రన్ గా కనిపిస్తోంది. దీనిలోని ఎల్‌ఈడీ లైట్ బ్యాండ్, రాత్రి వేళల్లో వెలిగే ఫోక్స్‌వ్యాగన్ లోగో కారుకు ఒక ప్రీమియం లుక్ ఇస్తాయి. ముఖ్యంగా జీటీ వెర్షన్ లోని రెడ్ హైలైట్స్ యువతను బాగా ఆకట్టుకుంటాయి. మరోవైపు, స్కోడా కుషాక్ తన ట్రెడిషనల్, మస్కులర్ డిజైన్‌ను కొనసాగిస్తోంది. వెనుక వైపు ఉన్న కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ పై SKODA అని రాసి ఉండటం కారుకు గంభీరమైన రూపాన్ని ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, టైగూన్ స్టైలిష్ గా ఉంటే, కుషాక్ సాలిడ్ గా కనిపిస్తుంది.
ఫీచర్లు, సౌకర్యాలు
ఫీచర్ల పరంగా ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ లో 40కి పైగా కొత్త అప్‌డేట్స్ వచ్చాయి. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హలో ఫోక్స్‌వ్యాగన్ వాయిస్ అసిస్టెంట్ వంటివి ఉన్నాయి. కుషాక్ లో కూడా ఇవే ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇందులో గూగుల్ ఆధారిత ఏఐ అసిస్టెంట్ ఉంది. కంఫర్ట్ విషయానికి వస్తే, కుషాక్ ఒక అడుగు ముందే ఉంది. ఇందులో వెనుక సీట్లకు కూడా మసాజ్ ఫంక్షన్, అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ సన్‌రూఫ్ సౌకర్యం ఉంది. టైగూన్ లో 6-వే ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఆకట్టుకుంటాయి.
సేఫ్టీ, ఇంజిన్
భద్రత విషయంలో ఈ రెండు కార్లకు తిరుగులేదు. గ్లోబల్ ఎన్ క్యాప్ నుంచి ఈ రెండూ 5-స్టార్ రేటింగ్ పొందాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, రెండింటిలోనూ 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. టైగూన్ లోని 1.0 లీటర్ ఇంజిన్ ఇప్పుడు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తోంది, ఇది సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ ను చాలా సులభం చేస్తుంది. కుషాక్ లో కూడా డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
స్పేస్, వేరియంట్లు
కుషాక్ లో వీల్ బేస్ 2,651 మి.మీ ఉండటం వల్ల వెనుక సీటులో కూర్చునే ప్రయాణికులకు లెగ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. 385 లీటర్ల బూట్ స్పేస్ ఫ్యామిలీ ట్రిప్పులకు సరిగ్గా సరిపోతుంది. టైగూన్ కూడా మంచి స్పేస్ ను ఇస్తుంది కానీ కుషాక్ సీట్లు కొంచెం ఎక్కువ కంఫర్ట్ గా అనిపిస్తాయి. టైగూన్ కంఫర్ట్‌లైన్, హైలైన్, జీటీ వంటి ట్రిమ్స్ లో లభిస్తుండగా.. కుషాక్ సిగ్నేచర్, ప్రెస్టీజ్, మాంటె కార్లో వంటి ఆకర్షణీయమైన వేరియంట్లలో అందుబాటులో ఉంది. మీ ప్రాధాన్యత స్టైల్ అయితే టైగూన్, సౌకర్యం అయితే కుషాక్ సరైన ఎంపిక అవుతాయి.