Volkswagen : ఎలక్ట్రిక్ అవతారంలోకి మారిన ఫోక్స్‌వ్యాగన్ పోలో.. ఒకే ఒక్క ఛార్జ్‌తో 455 కిమీ ప్రయాణం
ఒకే ఒక్క ఛార్జ్‌తో 455 కిమీ ప్రయాణం
Volkswagen : ప్రపంచవ్యాప్తంగా కార్ లవర్లకు అత్యంత ఇష్టమైన మోడల్స్‌లో ఫోక్స్‌వ్యాగన్ పోలో ఒకటి. గత 51 ఏళ్లుగా రోడ్ల మీద రారాజుగా వెలుగుతున్న ఈ కారు, ఇప్పుడు కాలంతో పాటు మారి సరికొత్త విద్యుత్ హంగులతో సిద్ధమైంది. అద్భుతమైన స్టైల్, పవర్‌ఫుల్ ఇంజిన్, లాంగ్ రేంజ్‌తో ID. Polo పేరుతో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. పాత పోలో క్లాసిక్ లుక్‌ను కోల్పోకుండానే, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో వచ్చిన ఈ కారు విశేషాలు చూద్దాం.
ఫోక్స్‌వ్యాగన్ తన వ్యూహంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ID సిరీస్ కింద ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే పోలో ఈవీని ID. Poloగా పిలుస్తున్నారు. ఇది చూడటానికి 2023లో కంపెనీ చూపించిన ID.2all కాన్సెప్ట్ కారు లాగే ఉంటుంది. దీని బాడీ ప్యానెల్స్ పూర్తిగా కొత్తవి. పొడవు పరంగా పాత పోలో కంటే కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ, వెడల్పు ఎక్కువగా ఉండటం వల్ల క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కారు కింద భాగంలో బ్యాటరీ ప్యాక్ అమర్చడం వల్ల కారు ఎత్తు కూడా కొంచెం పెరిగింది.
ID. పోలో డిజైన్‌లో గోల్ఫ్ కారు ఛాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా దీని సి-పిల్లర్ డిజైన్ పాత క్లాసిక్ గోల్ఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. 19 అంగుళాల భారీ అలాయ్ వీల్స్, హిడెన్ రియర్ డోర్ హ్యాండిల్స్ కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. వెనుక వైపు 3D ఎఫెక్ట్ కలిగిన టెయిల్ లైట్స్, వెలుగుతున్న VW లోగో కారుకు ప్రీమియం అప్పీల్‌ను ఇస్తాయి. ముందు భాగంలో హెడ్‌లైట్లతో కలిసేలా ఉండే లైట్ బార్ కూడా ఈ కారు ప్రత్యేకత.
చాలా కంపెనీలు టచ్ కంట్రోల్స్ వైపు మొగ్గు చూపుతుంటే, ఫాక్స్‌వ్యాగన్ కస్టమర్ల సౌకర్యం కోసం తిరిగి ఫిజికల్ బటన్లను ప్రవేశపెట్టింది. ఏసీ కంట్రోల్స్, స్టీరింగ్ వీల్ మీద బటన్లు ఇప్పుడు టచ్ కాకుండా నొక్కేలా ఉంటాయి. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఆపరేట్ చేయడం సులభం. 13 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, 10 అంగుళాల డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు హర్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు విలాసవంతమైన అనుభూతిని ఇస్తాయి. ఇందులో 441 లీటర్ల భారీ బూట్ స్పేస్ కూడా ఉంది.
ID. పోలో MEB+ ప్లాట్‌ఫారమ్‌పై తయారైంది. ఇది మూడు రకాల పవర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 114 hp, 133 hp, 208 hp. ఇందులో శక్తివంతమైన GT వెర్షన్ 223 hp పవర్‌ను జనరేట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, రెండు రకాలు ఉన్నాయి:
* 37 kWh బ్యాటరీ: ఇది దాదాపు 329 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.
* 52 kWh బ్యాటరీ: ఇది గరిష్టంగా 455 కి.మీల భారీ రేంజ్‌ను అందిస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల కేవలం 24 నుంచి 27 నిమిషాల్లోనే బ్యాటరీ 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా, ఇందులో వెహికల్-టు-లోడ్ ఫీచర్ ఉంది, దీని ద్వారా కారు బ్యాటరీతో ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వాడుకోవచ్చు.