Volvo EX90 : టీ కాఫీ తాగేలోపే కారు ఛార్జ్ అయిపోతుందట.. వోల్వో కొత్త ఎలక్ట్రిక్ కారు చూస్తే మైండ్ బ్లాకే

వోల్వో కొత్త ఎలక్ట్రిక్ కారు చూస్తే మైండ్ బ్లాకే

Update: 2026-07-22 07:25 GMT

Volvo EX90 : స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ వోల్వో, తన అత్యంత ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90ని త్వరలోనే భారత మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. కంపెనీ ఇప్పటివరకు లాంచ్ తేదీ మరియు ధరల వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ మోడల్ త్వరలోనే ఇండియన్ రోడ్లపై కనిపించనుందని స్పష్టం చేసింది. భారత్‌లో అడుగుపెట్టిన తర్వాత వోల్వో పోర్ట్‌ఫోలియోలోనే ఇది అత్యంత ఖరీదైన, అధునాతనమైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలవనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న EX30, EC40 మోడళ్ల కంటే పైస్థానంలో దీనిని నిలపనున్నారు.

లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మధ్య పోరు

ఇండియన్ లగ్జరీ EV సెగ్మెంట్‌లో వోల్వో EX90 రాకతో తీవ్రమైన పోటీ నెలకొననుంది. భారత్‌లోకి లాంచ్ అయిన తర్వాత ఇది ఇప్పటికే మార్కెట్‌లో మార్మోగుతున్న మెర్సిడెస్ బెంజ్ EQS SUV, బిఎమ్‌డబ్ల్యూ iX, ఆడి Q8 e-tron వంటి టాప్ రేంజ్ లగ్జరీ కార్లతో నేరుగా తలపడనుంది. ప్రీమియం విభాగంలో అత్యుత్తమ సేఫ్టీ, పవర్ఫుల్ రేంజ్ కోరుకునే కొనుగోలుదారులకు ఈ మోడల్ ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారనుంది.

ఆకట్టుకునే డిజైన్, విశాలమైన ఇంటీరియర్

గ్లోబల్ మార్కెట్‌లో ప్రజాదరణ పొందిన XC90కి ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా ఈ EX90ని తీసుకొచ్చారు. దీనిని వోల్వో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన SPA2 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. కారు ముందు భాగంలో ఐకానిక్ థోర్స్ హ్యామర్ LED హెడ్‌లైట్లు, ఏరోడైనమిక్ డిజైన్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ దీనికి రాయల్ లుక్‌ను అందిస్తాయి. కారు లోపల 7 మంది ప్రయాణించడానికి వీలుగా విశాలమైన సీటింగ్ అమర్చారు. అలాగే దాదాపు అన్ని ఆపరేషన్లను నియంత్రించేందుకు వీలుగా కేబిన్ మధ్యలో పెద్ద వర్టికల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు.

ఏకంగా 600 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్

సాంకేతిక వివరాల విషయానికి వస్తే, వోల్వో EX90లో భారీ 111 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ట్విన్ మోటార్, ట్విన్ మోటార్ పెర్ఫార్మెన్స్ అనే రెండు పవర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ పరంగా ఇందులో 250kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ 10% నుంచి 80% వరకు వేగంగా ఛార్జ్ అవుతుంది.

భద్రతలో సాటిలేని లిడార్ టెక్నాలజీ

వోల్వో బ్రాండ్ అంటేనే గుర్తుకువచ్చేది భద్రత. ఈ EX90 మోడల్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు అత్యాధునిక లిడార్ సెన్సార్లు, మల్టిపుల్ కెమెరాలు, రాడార్లు, అల్ట్రాసోనిక్ సెన్సార్లను జోడించారు. ఈ సెన్సార్లన్నీ డ్రైవర్‌ను నిరంతరం అప్రమత్తం చేస్తూ ప్రమాదాల తీవ్రతను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ కారు రాకను మాత్రమే ఖరారు చేసింది. భారత మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ధర, డెలివరీల వివరాలను త్వరలోనే ప్రకటించనుంది.

Tags:    

Similar News