VW Taigun Facelift vs Hyundai Creta : ఫోక్స్‌వ్యాగన్ టైగన్ vs హ్యుందాయ్ క్రెటా.. గెలుపు ఎవరిది?

గెలుపు ఎవరిది?

Update: 2026-04-17 10:29 GMT

VW Taigun Facelift vs Hyundai Creta : కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం రెండు దిగ్గజ కార్ల మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతోంది. అవే ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ క్రెటా. టైగూన్ తన జర్మన్ ఇంజనీరింగ్, డ్రైవింగ్ అనుభవంతో వినియోగదారులను ఆకట్టుకుంటుంటే, క్రెటా మాత్రం అదిరిపోయే ఫీచర్లు, విశాలమైన స్పేస్, ఇంజిన్ ఆప్షన్లతో ఈ సెగ్మెంట్‌లో రారాజుగా కొనసాగుతోంది. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్? ఏ కారు కొంటే లాభం? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సైజ్, రోడ్ ప్రెజెన్స్:

మొదటగా ఈ రెండు కార్ల డిజైన్, కొలతల గురించి మాట్లాడుకుంటే, హ్యుందాయ్ క్రెటా పొడవు, వెడల్పు, ఎత్తులో టైగూన్ కంటే పెద్దదిగా ఉంటుంది. దీనివల్ల క్రెటా రోడ్డుపై చాలా బలంగా, భారీగా కనిపిస్తుంది. అయితే, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని వీల్‌బేస్ క్రెటా కంటే కాస్త ఎక్కువ. దీనివల్ల కారు వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికులకు కాళ్ల దగ్గర స్థలం చాలా విశాలంగా అనిపిస్తుంది. సిటీ డ్రైవింగ్ కి టైగూన్ అనువుగా ఉంటే, ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ కి క్రెటా మంచి ఆప్షన్ గా కనిపిస్తుంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టైగన్ పూర్తిగా టర్బో పెట్రోల్ ప్రేమికుల కోసం తయారైంది. ఇందులో కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. జర్మన్ టెక్నాలజీతో కూడిన దీని ఇంజిన్ డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి కిక్కుని ఇస్తుంది. మరోవైపు క్రెటా విషయంలో మీకు చాలా ఆప్షన్లు లభిస్తాయి. ఇందులో పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి క్రెటా డీజిల్ ఇంజిన్ ఒక గొప్ప వరం. క్రెటాలోని 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ టైగూన్ కంటే కాస్త ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్ల జాతర

ఫీచర్ల గురించి మాట్లాడితే హ్యుందాయ్ క్రెటా అందరికంటే ముందు ఉంటుంది. టైగూన్ లో పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆరు ఎయిర్ బ్యాగులు వంటి నిత్యావసర ఫీచర్లు అన్నీ ఉన్నాయి. కానీ క్రెటా అంతటితో ఆగకుండా.. 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అదిరిపోయే సౌండ్ సిస్టమ్, లెవల్-2 అడాస్ (ADAS) వంటి అధునాతన ఫీచర్లను కూడా అందిస్తోంది. టెక్నాలజీ కావాలనుకునే వారు కళ్ళు మూసుకుని క్రెటాను ఎంచుకోవచ్చు.

ధర, పోటీ

2026 ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉండగా, హ్యుందాయ్ క్రెటా ధర రూ.10.79 లక్షల నుంచి రూ.20.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ఈ రెండు కార్లకు మార్కెట్లో కియా సెల్టోస్, టాటా సియెర్రా, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్ వంటి మోడళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మీకు పటిష్టమైన బాడీ, అదిరిపోయే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే టైగన్ వైపు వెళ్ళండి.. లేదు మాకు ఫ్యామిలీ కోసం ఎక్కువ ఫీచర్లు, విశాలమైన స్పేస్ కావాలంటే క్రెటాను ఎంచుకోండి.

Tags:    

Similar News