EV Tyres : ఎలక్ట్రిక్ కార్ల టైర్లు ఎందుకు త్వరగా అరిగిపోతాయి? అసలు గుట్టు విప్పిన నిపుణులు!

అసలు గుట్టు విప్పిన నిపుణులు!

Update: 2026-03-02 11:38 GMT

EV Tyres : ప్రస్తుతం ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం లేకపోవడం, శబ్దం లేకుండా ప్రశాంతంగా ప్రయాణించే వీలుండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీ కార్లనే కొంటున్నారు. అయితే, ఈవీ కార్ల యజమానులను ఒక సమస్య తరచూ వేధిస్తోంది. అదేమిటంటే.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల టైర్లు చాలా త్వరగా అరిగిపోతున్నాయి. ఇది కేవలం అపోహ మాత్రమే కాదు, వాస్తవమని ఆటోమొబైల్ నిపుణులు కూడా చెబుతున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు మరియు మీ టైర్ల ఆయుష్షును ఎలా పెంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కార్ల టైర్లు త్వరగా అరిగిపోవడానికి మొదటి , ప్రధాన కారణం అధిక బరువు. ఈవీ కార్లలో ఉండే బ్యాటరీ ప్యాక్ చాలా బరువుగా ఉంటుంది. ఒక సాధారణ పెట్రోల్ కారుతో పోలిస్తే, అదే సైజులో ఉండే ఎలక్ట్రిక్ కారు సుమారు 300 నుంచి 500 కిలోల వరకు అదనపు బరువును కలిగి ఉంటుంది. ఈ భారీ బరువు మొత్తం నాలుగు టైర్ల మీద పడుతుంది. కారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ బరువు కారణంగా టైర్ రబ్బరు, రోడ్డు మధ్య ఘర్షణ పెరుగుతుంది, దీనివల్ల టైర్లు వేగంగా అరిగిపోతాయి. అందుకే ఈవీల కోసం కంపెనీలు ప్రత్యేకమైన కఠినమైన టైర్లను తయారు చేస్తాయి.

మరో కీలకమైన కారణం ఇన్‌స్టంట్ టార్క్. ఎలక్ట్రిక్ కార్ల స్పెషాలిటీ ఏమిటంటే, మీరు యాక్సిలరేటర్ తొక్కగానే కారు క్షణాల్లో వేగాన్ని అందుకుంటుంది. పెట్రోల్ ఇంజిన్ లాగా పవర్ పెరగడానికి సమయం తీసుకోదు. ఈ మెరుపు వేగం వల్ల టైర్ల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ప్రతిసారి మీరు వేగంగా కారును స్టార్ట్ చేసినప్పుడు, టైర్ రబ్బరు రోడ్డును బలంగా గీసుకుంటూ వెళ్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల టైర్ల మీదుండే గ్రిప్ త్వరగా తగ్గిపోతుంది. ఇది కూడా టైర్ల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది.

డ్రైవింగ్ చేసే విధానం కూడా టైర్ల మన్నికపై ప్రభావం చూపుతుంది. ఈవీ కార్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో డ్రైవర్లు తరచూ వేగంగా వెళ్లడానికి, హఠాత్తుగా బ్రేకులు వేయడానికి ఆసక్తి చూపుతారు. దీనికి తోడు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా టైర్ల మీద కొంత ప్రభావం చూపుతుంది. మీరు యాక్సిలరేటర్ వదలగానే బ్యాటరీ ఛార్జ్ అవ్వడం కోసం కారు తనంతట తానుగా వేగాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రక్రియలో కూడా టైర్ల మీద ఒత్తిడి పడుతుంది. అలాగే, ఈవీ కార్లు నిశ్శబ్దంగా ఉండటం వల్ల టైర్లు అరిగిపోయేటప్పుడు వచ్చే శబ్దం మనకు సరిగ్గా వినిపించదు, దీనివల్ల సమస్య ముదిరే వరకు మనం గమనించలేం.

టైర్ల ఆయుష్షు పెరగాలంటే సరైన మెయింటెనెన్స్ తప్పనిసరి. టైర్లలో గాలి పీడనం ఎప్పుడూ కంపెనీ సూచించిన మేరకే ఉండాలి. గాలి తక్కువగా ఉంటే టైర్ పక్కభాగాలు త్వరగా దెబ్బతింటాయి, ఎక్కువగా ఉంటే మధ్యలో అరిగిపోతాయి. అలాగే ప్రతి 5,000 నుంచి 8,000 కిలోమీటర్లకు ఒకసారి టైర్ రొటేషన్ (ముందు టైర్లను వెనక్కి, వెనక టైర్లను ముందుకు మార్చడం) చేయడం వల్ల నాలుగు టైర్లు సమానంగా అరుగుతాయి. వీల్ అలైన్‌మెంట్, బ్యాలెన్సింగ్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం వల్ల టైర్ల జీవిత కాలాన్ని 20 నుంచి 30 శాతం వరకు పెంచుకోవచ్చు.

Tags:    

Similar News