Car Loan Tips : రూపాయి లేకుండా కారు ఇస్తామంటే నమ్మేస్తున్నారా? జీరో డౌన్ పేమెంట్ లోన్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే

జీరో డౌన్ పేమెంట్ లోన్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే

Update: 2026-07-07 06:00 GMT

Car Loan Tips : ప్రస్తుత రోజుల్లో సొంత కారు కొనుగోలు చేయాలనేది ప్రతి ఒక్కరి కల. కస్టమర్ల లగ్జరీ అవసరాలను, ఆశలను ఆసరాగా చేసుకుని కార్ల కంపెనీలు, బ్యాంకులు కలిసి జీరో డౌన్ పేమెంట్ కార్ లోన్ పేరిట సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోయినా సరికొత్త కారును ఇంటికి తీసుకెళ్లవచ్చనే ప్రచారాలు వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. చాలా మంది ఇదొక సులువైన మార్గమని భావించి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా కార్లు కొనడానికి సిద్ధపడుతున్నారు. అయితే, పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పథకం వెనుక కస్టమర్లకు తెలియని ఎన్నో ఆర్థిక నష్టాలు, సవాళ్లు దాగి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక భారీ మోసం

సాధారణంగా మనం ఏదైనా వాహనాన్ని లోన్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు కారు ధరలో కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో ముందే చెల్లిస్తాం. మిగిలిన మొత్తానికి మాత్రమే బ్యాంకులు లోన్ ఇస్తాయి. కానీ ఈ జీరో డౌన్ పేమెంట్ స్కీమ్‌లో కారు పూర్తి ఆన్-రోడ్ ధరను బ్యాంకే ఫైనాన్స్ చేస్తుంది. అంటే మీరు కారు కోసం రూపాయి కూడా ముందే కట్టరు. అంతా బానే ఉన్నా, దీనివల్ల మీ లోన్ మొత్తం చాలా పెద్దదిగా మారిపోతుంది. లోన్ అమౌంట్ ఎంత ఎక్కువగా ఉంటే, మీరు ప్రతి నెల చెల్లించాల్సిన నెలవారీ కిస్తీ కూడా అంత భారీగా పెరుగుతుంది. ఇది మీ నెలవారీ ఇంటి బడ్జెట్‌ను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

బ్యాంకుల అదనపు వడ్డీ వడ్డన

జీరో డౌన్ పేమెంట్ లోన్లలో వడ్డీ రేట్లు మరొక పెద్ద సమస్యగా మారుతాయి. కస్టమర్ల దగ్గర నుంచి ఎలాంటి ముందస్తు డబ్బు తీసుకోకుండా పూర్తి మొత్తాన్ని అప్పుగా ఇవ్వడాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారంగా భావిస్తాయి. ఈ రిస్క్‌ను కవర్ చేయడానికి వారు సాధారణ కార్ లోన్ల కంటే ఈ స్కీమ్‌లపై ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. సాధారణ వడ్డీ రేట్లతో పోలిస్తే ఇందులో 1 నుంచి 2 శాతం వరకు అదనపు వడ్డీని విధిస్తారు. పైకి ఇది చిన్న మార్పులా కనిపించినప్పటికీ, 5 నుంచి 7 ఏళ్ల సుదీర్ఘ లోన్ కాలవ్యవధిలో ఈ 2 శాతం అదనపు వడ్డీ మీపై భారీ భారాన్ని మోపుతుంది. దీనివల్ల కారు అసలు ధర కంటే మీరు చాలా ఎక్కువ మొత్తాన్ని వడ్డీ రూపంలోనే బ్యాంకులకు సమర్పించుకోవాల్సి వస్తుంది.

కస్టమర్లకు తెలియని హిడెన్ ఛార్జీల భారం

ఉచితంగా ఏదీ రాదు అన్నట్లు.. ఈ ప్రకటనలలో ఏమీ చెల్లించక్కర్లేదు అని చెప్పినప్పటికీ, కారు కొనే సమయంలో అయ్యే ఇతర ఖర్చులను కస్టమర్లే భరించాల్సి ఉంటుంది. కారు రిజిస్ట్రేషన్ కోసం అయ్యే రోడ్ టాక్స్, వెహికల్ ఇన్సూరెన్స్, బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు వంటి ఖర్చులు ముందే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ దగ్గర ఆ డబ్బు కూడా లేకపోతే, బ్యాంకులు ఆ మొత్తాన్ని కూడా మీ కారు లోన్ అకౌంట్‌కే అదనంగా జత చేస్తాయి. దీనివల్ల మీ అప్పు మరింత పెరిగిపోయి, దానిపై కూడా మీరు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సంతకం పెట్టే ముందు జాగ్రత్త

ఈ ఆఫర్ల వెనుక ఉండే నిబంధనలు, షరతులు చాలా క్లిష్టంగా ఉంటాయి. కారు డెలివరీ తీసుకునే అర్జంటులో చాలా మంది కస్టమర్లు లోన్ అగ్రిమెంట్ పేపర్లను పూర్తిగా చదవకుండానే సంతకాలు పెట్టేస్తుంటారు. తర్వాతి కాలంలో కారు లోన్ ముందే క్లోజ్ చేయాలన్నా, లేదా నెలసరి ఈఎంఐ ఒక రోజు ఆలస్యమైనా బ్యాంకులు భారీ మొత్తంలో పెనాల్టీలు వసూలు చేస్తాయి. కాబట్టి, ఎలాంటి జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లను ఎంచుకునే ముందైనా సరే, ఆ పత్రాలలో ఉన్న ప్రతి లైన్‌ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కారు కొనడం అనేది ఒక సంతోషకరమైన విషయమే అయినా, అది మీ ఆర్థిక స్థితికి భారం కాకుండా చూసుకోవడమే అత్యంత ఉత్తమమైన నిర్ణయం.

Tags:    

Similar News