Bank Account: మీ అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యాయా? వెంటనే ఈ పని చేయండి
వెంటనే ఈ పని చేయండి
Bank Account: బ్యాంకు ఖాతాలో రూపాయి రూపాయి పోగేసుకుని దాచుకుంటే, ఉన్నట్టుండి ఒక్క మెసేజ్ రాకుండానే మనీ మాయమైతే ఆ షాకే వేరుగా ఉంటుంది. డిజిటల్ యుగంలో ఇలాంటి మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నోయిడాలోని ఓ బ్యాంకులో ఏకంగా ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి కోట్ల రూపాయలు ఆవిరైపోయిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. అయితే మీ ప్రమేయం లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే కంగారుపడాల్సిన పనిలేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీరు సరైన సమయంలో స్పందిస్తే కట్ అయిన మొత్తం డబ్బు తిరిగి మీ ఖాతాలో పడుతుంది.
వెంటనే చేయాల్సిన మూడు పనులు
ఖాతా నుంచి అనధికారికంగా నగదు కట్ అయినట్లు తెలిసిన వెంటనే కొన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలి. మొదటగా మీ బ్యాంకుకు ఫోన్ చేసి జరిగిన మోసాన్ని వివరించాలి. సైబర్ కేటుగాళ్లు మరింత డబ్బులు కాజేయకుండా వెంటనే మీ ఖాతాను లేదా డెబిట్ కార్డును ఫ్రీజ్ చేయమని చెప్పాలి. రెండోదిగా లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ స్క్రీన్షాట్లు, బ్యాంకు స్టేట్మెంట్ను భద్రపరుచుకోవాలి. మూడో ముఖ్యమైన పని నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయడం లేదా cybercrime.gov.in పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయడం.
ఆర్బీఐ నిబంధనలు.. ఎవరిది బాధ్యత?
బ్యాంకు అంతర్గత లోపాలు లేదా సర్వర్ సమస్యల వల్ల మోసం జరిగితే ఖాతాదారుడిపై ఎలాంటి బాధ్యత ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు ఫిర్యాదు చేసినా నష్టపోయిన పూర్తి డబ్బును బ్యాంకు వాళ్లే తిరిగి చెల్లించాలి. ఒకవేళ థర్డ్ పార్టీ పొరపాటు వల్ల ఫ్రాడ్ జరిగితే, అనుమానాస్పద లావాదేవీ జరిగిన మూడు పనిదినాల్లోపు బ్యాంకుకు సమాచారం ఇస్తే నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కస్టమర్‌పై పడదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ షరతులకు లోబడితే మొత్తం డబ్బు రిఫండ్ లభిస్తుంది.
ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే నష్టపోతారా?
మోసం జరిగిన నాలుగు నుంచి ఏడు రోజుల మధ్యలో బ్యాంకుకు ఫిర్యాదు అందిస్తే ఖాతాదారుల బాధ్యత కొంత పరిమితం అవుతుంది. ఇలాంటి కేసుల్లో అకౌంట్ రకాన్ని బట్టి రూ.5,000 నుంచి రూ.25,000 వరకు లేదా పోయిన మొత్తం (ఏది తక్కువైతే అది) కస్టమర్ భరించాల్సి వస్తుంది. ఒకవేళ ఏడు రోజుల తర్వాత ఆలస్యంగా కంప్లైంట్ ఇస్తే బ్యాంకు నిబంధనల ప్రకారం నిర్ణయం ఉంటుంది. మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ ఇతరులతో షేర్ చేయడం వల్ల నష్టం జరిగితే ఫిర్యాదు చేసే వరకు అయ్యే నష్టాన్ని మీరే భరించాల్సి వస్తుంది.
డబ్బులు ఎప్పుడు రిఫండ్ అవుతాయి?
బ్యాంకుకు ఫిర్యాదు అందిన నాటి నుంచి పది పనిదినాల లోపు ఖాతాదారుడి అకౌంట్లో ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో డబ్బు జమ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. డబ్బులు కట్ అయిన నాటి నుంచే ఈ వడ్డీ వర్తిస్తుంది. సేవింగ్స్ ఖాతా అయితే వడ్డీ నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకుదే. మొత్తం విచారణ పూర్తి చేసి గరిష్టంగా 90 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలి. నిర్ణీత సమయంలోగా బ్యాంకు స్పందించకపోతే బాధ్యులైన సిబ్బందిపై చర్యలతో పాటు వినియోగదారుడికి పూర్తి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.