Bank Holidays: పండుగల సమయం రానే వచ్చింది. అక్టోబర్ 2026 నెల ప్రవేశిస్తుండటంతో దేశవ్యాప్తంగా పండుగల సందడి నెలకొంది. దసరా, దుర్గాపూజ, గాంధీ జయంతి, గార్బా, ఛత్ పూజ వంటి ముఖ్యమైన పండుగలు ఈ నెలలోనే రానున్నాయి. పండుగల రద్దీ కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో ఏకంగా 16 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకింగ్ పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లేవారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం.

5 శనివారాల్లో 4 రోజులు బ్యాంకులు బంద్

సాధారణంగా ప్రతి నెలలోని రెండవ, నాల్గవ శనివారాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు అధికారిక సెలవు ఉంటుంది. అయితే అక్టోబర్ నెలలో శనివారాల పరంగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో మొత్తం 5 శనివారాలు రాగా, అందులో ఏకంగా 4 శనివారాలు బ్యాంకులు పనిచేయవు. రెండవ శనివారం (అక్టోబర్ 10), నాల్గవ శనివారం (అక్టోబర్ 24) సాధారణ సెలవులు కాగా, మూడవ శనివారం (అక్టోబర్ 17 - మహా సప్తమి), ఐదవ శనివారం (అక్టోబర్ 31 - సర్దార్ పటేల్ జయంతి) వివిధ ప్రాంతాల్లో పండుగల వల్ల సెలవులు వచ్చాయి. మొదటి శనివారం ఒక్కటే బ్యాంకు పనిదినంగా ఉండనుంది.

అక్టోబర్ 2026 బ్యాంక్ సెలవుల రోజువారీ వివరాలు

* అక్టోబర్ 2: గాంధీ జయంతి (దేశవ్యాప్తంగా జాతీయ సెలవు)

* అక్టోబర్ 4: ఆదివారం (వారాంతపు సెలవు)

* అక్టోబర్ 10: మహాలయ అమవాస్య / రెండవ శనివారం (దేశవ్యాప్తంగా సెలవు)

* అక్టోబర్ 11: ఆదివారం (వారాంతపు సెలవు)

* అక్టోబర్ 17: మహా సప్తమి (త్రిపురలో సెలవు)

* అక్టోబర్ 18: ఆదివారం (వారాంతపు సెలవు)

* అక్టోబర్ 19: మహా అష్టమి / మహా నవమి / దుర్గాపూజ (తెలుగు రాష్ట్రాలు, బెంగాల్, ఒడిశా, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సెలవు)

* అక్టోబర్ 20: విజయదశమి / దసరా (మణిపూర్, సిక్కిం మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సెలవు)

* అక్టోబర్ 21: దుర్గాపూజ / దసైన్ (బెంగాల్, కేరళ, కర్ణాటక, సిక్కిం, అస్సాం, త్రిపురలలో సెలవు)

* అక్టోబర్ 22: దుర్గాపూజ (సిక్కింలో సెలవు)

* అక్టోబర్ 23: దుర్గాపూజ (సిక్కింలో సెలవు)

* అక్టోబర్ 24: నాల్గవ శనివారం (దేశవ్యాప్తంగా సెలవు)

* అక్టోబర్ 25: ఆదివారం (వారాంతపు సెలవు)

* అక్టోబర్ 26: లక్ష్మీ పూజ / వాల్మీకి జయంతి / విలీన దినోత్సవం (జమ్మూ కాశ్మీర్, ఛండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపురలలో సెలవు)

* అక్టోబర్ 29: కర్వా చౌత్ (హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు)

* అక్టోబర్ 31: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి (గుజరాత్‌లో సెలవు)

రాష్ట్రాల వారీగా మారే సెలవులు

రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన ఈ సెలవుల జాబితా అన్ని రాష్ట్రాలకు ఒకేలా వర్తించదు. జాతీయ సెలవులైన గాంధీ జయంతి (అక్టోబర్ 2), దసరా (అక్టోబర్ 20), వారాంతపు ఆదివారాలు, 2వ, 4వ శనివారాల్లో మాత్రమే దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. మిగిలిన సెలవులు ఆయా రాష్ట్రాల స్థానిక పండుగలు, సంస్కృతి ఆధారంగా నిర్ణయమవుతాయి. ఉదాహరణకు దుర్గాపూజ సెలవులు పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో దసరా విజయదశమికి ప్రాధాన్యం ఉంటుంది.

అందుబాటులోనే డిజిటల్ సేవలు

భౌతికంగా బ్యాంక్ శాఖలు మూతపడినప్పటికీ, ఖాతాదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతికత కారణంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, యూపీఐ సేవలు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తాయి. అత్యవసర నగదు విత్ డ్రా కోసం ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్లు అందుబాటులో ఉంటాయి. బిల్లుల చెల్లింపులు, నగదు బదిలీలు (IMPS, NEFT) డిజిటల్ విధానంలో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. కాగా పెద్ద మొత్తంలో డ్రాఫ్ట్‌లు, చెక్కుల క్లియరెన్స్, క్యాష్ విత్‌డ్రాల వంటి పనులను సెలవుల క్యాలెండర్ చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Tags: