Pets Rent : బెంగళూరులో కొత్త రూల్..ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఎక్కువ అద్దె చెల్లించాల్సిందే

ఇంట్లో కుక్కను పెంచుకుంటే ఎక్కువ అద్దె చెల్లించాల్సిందే

Update: 2025-11-26 10:58 GMT

Pets Rent : భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు, ఐటీ ఉద్యోగాలతో పాటు పెంపుడు జంతువుల పట్ల ప్రజల ప్రేమకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అయితే ఇప్పుడు ఈ ప్రేమ జేబుకు భారీ భారం అవుతోంది. బెంగళూరులో అద్దె ఇళ్లలో నివసించే వారు, తమ పెంపుడు జంతువుల కోసం అదనంగా పెట్స్ రెంట్ చెల్లించాల్సిన కొత్త నియమం మొదలైంది. ఇంటి యజమానులు అద్దె ఒప్పందంలో కొత్త క్లాజ్ జోడించి, అద్దెదారుల నుంచి నెలకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు అదనపు అద్దె వసూలు చేస్తున్నారు.

ఈ పెట్స్ రెంట్ ట్రెండ్ మొదట కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ వంటి ఖరీదైన ప్రాంతాలలో మొదలైంది. పెంపుడు జంతువుల వల్ల ఇంటికి ఎక్కువ నష్టం జరుగుతుందని, ముఖ్యంగా గోడలకు, ఫ్లోర్‌కు గీతలు పడటం, వెంట్రుకలు, వాసన కారణంగా డీప్ క్లీనింగ్ ఖర్చు పెరుగుతుందని యజమానులు ఈ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు ఇందిరానగర్, వైట్‌ఫీల్డ్ వంటి ఇతర ప్రాంతాలకు కూడా పాకింది. అదనపు అద్దెతో పాటు, పెంపుడు జంతువుల యజమానులు నాన్-రిఫండబుల్ పెట్స్ డిపాజిట్, ఇంటి పెయింటింగ్ ఖర్చు ముందుగానే చెల్లించడం, లిఫ్ట్‌లో వాటిని ఎత్తుకొని వెళ్లడం, కొన్ని జాతుల కుక్కలను ఇంట్లో ఉంచడానికి పూర్తిగా నిషేధం వంటి అనేక కఠినమైన షరతులను ఎదుర్కొంటున్నారు.

పెంపుడు జంతువుల పట్ల యజమానులు విధించే ఈ కఠినమైన నిబంధనల వెనుక ఉన్న చట్టపరమైన అంశం తెలుసుకోవడం ముఖ్యం. చట్టపరంగా చూస్తే దేశంలో ఏ హౌసింగ్ సొసైటీ కూడా పెంపుడు జంతువులను పెంచడాన్ని పూర్తిగా నిషేధించలేదు. అయితే ఇక్కడ ఒక చట్టపరమైన లూప్ హోల్ ఉంది.. అదే ప్రైవేట్ ఇంటి యజమాని. ప్రైవేట్ ఇంటి యజమానులు తమ అద్దె ఒప్పందంలో ఎలాంటి నిబంధనలైనా చేర్చవచ్చు. అద్దెదారు ఆ ఒప్పందంపై సంతకం చేస్తే, ఆ నిబంధనలన్నింటినీ అంగీకరించినట్లే అవుతుంది. ఈ పెట్స్ రెంట్, పెట్స్ డిపాజిట్ వసూలు చేయడం వెనుక ఉన్న కారణం ఈ చట్టపరమైన లొసుగునే.

Tags:    

Similar News