Stock Market Crash : బీహార్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

Update: 2025-11-14 10:24 GMT

 Stock Market Crash : వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం (నవంబర్ 14) భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనంతో కుప్పకూలాయి. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం అయ్యేసరికి మరింత కుంగిపోయాయి. ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాలు సృష్టించిన రాజకీయ అనిశ్చితి, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు పుండు మీద కారం చల్లినట్లు మారాయి. ఫలితంగా సెన్సెక్స్ కీలక మైలురాయిని కోల్పోగా, నిఫ్టీ కూడా 25,785 స్థాయికి పడిపోయింది.

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 409 పాయింట్లు కోల్పోయి 84,069 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 124 పాయింట్లు పడిపోయి 25,755 స్థాయికి దిగివచ్చింది. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది..ఈ రంగం 1.82% వరకు నష్టపోయింది. ఈ పతనానికి దారితీసిన ముఖ్య కారణాలను ఇప్పుడు చూద్దాం.

1. బీహార్ ఎన్నికల ఫలితాల టెన్షన్

ఈ భారీ పతనానికి ప్రధాన కారణం బీహార్ ఎన్నికల ఫలితాల టెన్షన్. ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు విరుద్ధంగా వస్తుండటంతో, ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అనిశ్చితి భయంతో లాభాల స్వీకరణకు, అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ ప్రకారం.. ఈరోజు మార్కెట్ మొత్తం బీహార్ ఎన్నికలపైనే దృష్టి పెట్టింది. అయితే, ఈ ఫలితాల ప్రభావం మార్కెట్‌పై తాత్కాలికంగానే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

2. పెరిగిన ముడి చమురు ధరలు

మార్కెట్ పతనానికి మరో ముఖ్య కారణం ముడి చమురు ధరలు పెరగడం. భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతులపైనే ఆధారపడుతుంది. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.71% పెరిగి బ్యారెల్‌కు 60.28 డాలర్లకు చేరింది. క్రూడ్ ధరలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, ఇది ద్రవ్యోల్బణం పెంచుతుంది. అందుకే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

3. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా వారు నిరంతరం అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. గురువారం ఒక్కరోజే విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి రూ. 383.68 కోట్లను అమ్మేశారు. విదేశీ ఇన్వెస్టర్లు డబ్బులు వెనక్కి తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.

4. బలహీనమైన గ్లోబల్ సంకేతాలు

కేవలం దేశీయ కారణాలే కాదు, అంతర్జాతీయంగా కూడా బలహీన సంకేతాలు మార్కెట్‌ను కుంగదీశాయి. గురువారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. శుక్రవారం దక్షిణ కొరియా కోస్పి 2.2%, జపాన్ నిక్కీ 1.7%, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.4% మేర నష్టపోయి రెడ్ మార్క్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ప్రపంచవ్యాప్త అమ్మకాల ఒత్తిడి భారత మార్కెట్లపైనా పడింది.

Tags:    

Similar News