BSNL : జియో, ఎయిర్‌టెల్‌కు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఒక్క నెలలో 13 లక్షల కొత్త యూజర్లు
ఒక్క నెలలో 13 లక్షల కొత్త యూజర్లు
BSNL : భారత టెలికాం రంగంలో ఆగస్టు 2025 నెలలో ఒక పెద్ద మార్పు కనిపించింది. ఈ నెలలో జియో, ఎయిర్‌టెల్ ఎప్పటిలాగే తమ కస్టమర్లను పెంచుకోగా బీఎస్ఎన్ఎల్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా 13.85 లక్షల కొత్త మొబైల్ వినియోగదారులను జోడించింది. ఇటీవలే 4G సర్వీసులను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ ఈ పెరుగుదలతో తిరిగి పోటీలోకి వచ్చినట్లు సంకేతాలు ఇచ్చింది. దీనికి విరుద్ధంగా, వొడాఫోన్ ఐడియా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ సంస్థ ఈ కాలంలో 3.09 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఆగస్టులో 13.85 లక్షల కొత్త యూజర్లను జోడించి తన రీఎంట్రీని గట్టిగా సూచించింది. అయితే మరో ప్రభుత్వ సంస్థ ఎమ్టీఎన్ఎల్ మాత్రం నష్టాలను కొనసాగించింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా ఏకంగా 3.09 లక్షల మొబైల్ కస్టమర్లను కోల్పోవడం ఆ సంస్థకు కొత్త సమస్యగా మారింది. ఇప్పటికే అప్పులు, ఏజీఆర్ బకాయిలతో సతమతమవుతున్న వీఐకి, ఈ కస్టమర్ల తగ్గుదల మరింత ముప్పును పెంచే అవకాశం ఉంది.
రిలయన్స్ జియో ఆగస్టు నెలలో అత్యధికంగా 19.49 లక్షల మొబైల్ కస్టమర్లను జోడించి, 41% కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో టెలికాం పరిశ్రమలో నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. అయితే, వైర్‌లైన్ సెగ్మెంట్లో జియో 15.51 లక్షల కస్టమర్లను కోల్పోయింది. ఇంకోవైపు, భారతీ ఎయిర్‌టెల్ 4.96 లక్షల మొబైల్ కస్టమర్లను పెంచుకుంది. అలాగే వైర్‌లైన్ విభాగంలో కూడా 1.08 లక్షల కొత్త యూజర్లను జోడించింది.
ఆగస్టు 2025 నాటికి దేశంలోని మొత్తం మొబైల్ సబ్‌స్క్రైబర్ బేస్ 116.7 కోట్లకు చేరింది. ఇందులో పట్టణ ప్రాంతాల కస్టమర్లు 686.79 మిలియన్లు (56%) కాగా, గ్రామీణ ప్రాంతాల కస్టమర్లు 537.75 మిలియన్లు (44%) ఉన్నారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో టెలిడెన్సిటీ 134% కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది కేవలం 59.31% మాత్రమే ఉంది. కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం రంగం అభివృద్ధికి ఇంకా భారీ అవకాశాలు ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.