Walkie Talkie: లైసెన్స్ నిబంధనలు దాచిపెట్టి వాకీ-టాకీలు అమ్ముతున్నారా? ఇక జైలుకే
ఇక జైలుకే
Walkie Talkie: ఆన్లైన్ షాపింగ్ జోరుగా సాగుతున్న తరుణంలో పర్సనల్ మొబైల్ రేడియో అనగా వాకీ-టాకీల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ నిఘా మరింత కఠినతరమైంది. వినియోగదారులకు ఎలాంటి లైసెన్స్ నిబంధనలు, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వివరాలు చెప్పకుండా వాకీ-టాకీలు అమ్ముతున్న కంపెనీలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హోగర్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ ఎల్ఎల్పీ అనే సంస్థ తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తూ పూర్తి సమాచారం దాచిపెట్టినట్లు గుర్తించింది. ఈ మేరకు ఆ కంపెనీకి లక్ష రూపాయల జరిమానా విధించి షాకిచ్చింది. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో నడుస్తున్న తప్పుడు వ్యాపార పద్ధతులకు అడ్డుకట్ట వేసేలా ఈ చర్యలు చేపట్టారు.
కస్టమర్లను గుడ్డిలో పడేస్తున్న కంపెనీలు
సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే నేతృత్వంలో ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిగింది. వెబ్సైట్లలో వాకీ-టాకీల ప్రకటనలు ఇచ్చేటప్పుడు ఆ పరికరాలు ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేస్తాయి, వాటి వాడకానికి ప్రభుత్వ లైసెన్సులు అవసరమా లేదా అనే విషయాలు కంపెనీలు కావాలనే దాచిపెడుతున్నాయి. ఇటువంటి అసంపూర్ణ సమాచారం వల్ల కొనుగోలుదారులు ఎలాంటి అనుమతులు లేకుండానే వీటిని చట్టబద్ధంగా వాడవచ్చని అపోహ పడుతున్నారు. దీనివల్ల అమాయక ప్రజలు తెలియకుండానే తీవ్రమైన చట్టపరమైన అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కంపెనీల సాకులు చెల్లవు
విచారణ సందర్భంగా సదరు విక్రేత సంస్థ తమ వద్ద డీలర్ పొసెసింగ్ లైసెన్స్ ఉందని, పరికరాలన్నీ సరైన టైప్ అప్రూవల్ సర్టిఫికెట్ కలిగి ఉన్నాయని వాదించింది. అంతేకాకుండా తమ వెబ్సైట్ ద్వారా నేరుగా ఆన్లైన్ అమ్మకాలు జరగడం లేదని, కేవలం లీడ్స్ మాత్రమే సేకరిస్తున్నామని నూతన సాకులు చెప్పింది. అయితే సీసీపీఏ ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ప్రభుత్వ అనుమతులు ఉన్నంత మాత్రాన కొనుగోలుదారుడికి పూర్తి వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ప్రత్యక్ష విక్రయాలు లేకపోయినా ప్రకటనలు చేసే ప్రతి ప్లాట్‌ఫారమ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.
రూపొందించిన కఠిన నిబంధనలు
తక్కువ పవర్ ఉండే రేడియో పరికరాల కోసం 2018 సంవత్సరంలోనే ప్రత్యేక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేవలం 446.0 నుంచి 446.2 MHz ఫ్రీక్వెన్సీలో పనిచేసే పరికరాలకు మాత్రమే కొన్ని షరతులతో లైసెన్స్ మినహాయింపు ఉంటుంది. అంతకుమించి వేరే ఫ్రీక్వెన్సీ ఉన్న వాటికి కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. నిబంధనలను ఉల్లంఘిస్తూ తప్పుగా విక్రయాలు జరుపుతున్న 16,970కి పైగా ప్రకటనలను గుర్తించిన సీసీపీఏ, ఇప్పటివరకు 12 కంపెనీలపై చర్యలు తీసుకుంది. ఈ మోసపూరిత కంపెనీల నుంచి మొత్తం 58 లక్షల రూపాయల భారీ జరిమానా వసూలు చేసింది. వినియోగదారులు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కొనేముందు వాటి నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.