Rapido: రాపిడోకు భారీ షాక్.. ఎక్కువ డబ్బులిస్తేనే రైడ్ ఇస్తామన్నందుకు రూ.10 లక్షల జరిమానా
రూ.10 లక్షల జరిమానా
Rapido: ప్రముఖ రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన రాపిడో సంస్థకు వినియోగదారుల పరిరక్షణ మండలి నుంచి గట్టి షాక్ తగిలింది. రైడ్ బుక్ చేసుకునే సమయంలో కస్టమర్లు ఎక్కువ డబ్బులు చెల్లించేలా వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తీవ్రంగా స్పందించింది. రాపిడో ఆపరేటర్ కంపెనీ అయిన రోప్పెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ పై ఏకంగా రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది. కంపెనీ తన యాప్ డిజైన్, ప్రీ-రైడ్ టిప్పింగ్ విధానాల ద్వారా ప్రయాణికులను అధిక ఛార్జీలు చెల్లించేలా తప్పుదారి పట్టిస్తోందని రెగ్యులేటరీ స్పష్టం చేసింది.
సీసీపీఏ చేపట్టిన విచారణలో రాపిడో యాప్‌కు సంబంధించిన కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యాప్‌లో రైడ్ బుక్ చేసుకునే సమయంలో కస్టమర్లకు మరింత ఎక్కువ ధర చెల్లించాలంటూ వివిధ రకాల మెసేజ్‌లు చూపించినట్లు తేలింది. ఉదాహరణకు, ఎక్కువ ధర చెల్లిస్తే రైడ్ దొరికే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది అనే మెసేజ్లను ప్రదర్శించారు. అలాగే, క్యాప్టెన్ రూ. 60కి రైడ్ అంగీకరించడం లేదు, మీరు మరో రూ. 10, 20 లేదా 30 అదనంగా జోడించవచ్చు అంటూ యూజర్లపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చారు. మొదట కిరాయిని చూపించి, బుకింగ్ సమయంలో అదనపు మొత్తం ఇవ్వాలని కోరడం ద్వారా త్వరగా రైడ్ కావాలంటే ఎక్కువ డబ్బులివ్వాల్సిందేననే అభూతకల్పనను యాప్ సృష్టించిందని అధికారులు తేల్చేశారు.
రాపిడో యాప్ డిజైన్‌లో వినియోగదారులను మోసగించే రెండు ప్రధాన రకాల డార్క్ ప్యాటర్న్స్ ఉన్నట్లు సీసీపీఏ గుర్తించింది. మొదటిది కన్ఫర్మ్ షేమింగ్ కాగా, రెండవది ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫెరెన్స్. తక్కువ ధర ఎంచుకున్నప్పుడు ఎరుపు లేదా నారింజ రంగులో హెచ్చరికలు చూపించడం, ఎక్కువ మొత్తం ఎంచుకున్నప్పుడు ఆకుపచ్చ రంగులో రైడ్ దొరికే అవకాశం ఎక్కువగా ఉందని చూపించడం ద్వారా యూజర్ల నిర్ణయాలను యాప్ డిజైన్ స్వార్థపూరితంగా ప్రభావితం చేసిందని తేలింది. రాపిడో ప్రవేశపెట్టిన సెట్ యువర్ ప్రైస్ ఫీచర్‌పై కూడా రెగ్యులేటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
రైడ్ ప్రారంభం కాకముందే అదనపు మొత్తాన్ని టిప్ రూపంలో వసూలు చేయడంపై కూడా సీసీపీఏ సీరియస్ అయింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ప్రకారం.. టిప్ ఇచ్చే ఆప్షన్ అనేది ప్రయాణం విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉండాలి, అంతేగానీ బుకింగ్ సమయంలో కాదని స్పష్టం చేసింది. అదనపు చెల్లింపులు పూర్తిగా స్వచ్ఛందమేనని, డ్రైవర్-ప్రయాణికుల మధ్య సాధారణ సంభాషణ లాంటిదని రాపిడో వాదించినప్పటికీ.. ఎక్కువ డబ్బులిస్తేనే రైడ్ కన్ఫర్మ్ అవుతుందనేదానికి ఎలాంటి సరైన ఆధారాలు చూపలేకపోవడంతో ఆ వాదనలను తోసిపుచ్చారు. కాగా, కేవలం రాపిడో మాత్రమే కాకుండా ఉబర్, ఓలా వంటి ఇతర ప్రముఖ అగ్రిగేటర్ల తీరుపై కూడా నిఘా కొనసాగుతోంది. వినియోగదారులు ఇలాంటి అనుచిత వ్యాపార పద్ధతులపై నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 1915కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.