Family Pension: ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలపై కేంద్రం కీలక ప్రకటన.. ఎవరికి పెన్షన్ వస్తుంది? ఎవరికి రాదు?
ఎవరికి పెన్షన్ వస్తుంది? ఎవరికి రాదు?
Family Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించిన తర్వాత ఆ కుటుంబంలో ఎవరికి ఫ్యామిలీ పెన్షన్ దక్కుతుందనే అంశంపై ఇప్పటివరకు చాలామందిలో గందరగోళం నెలకొంది. ఈ అయోమయానికి తెరదించుతూ పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 29, 2026న విడుదల చేసిన ఈ మెమోరాండం ప్రకారం.. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ పెన్షన్ రాదు. మరణించిన ఉద్యోగితో ఉన్న బంధుత్వం, సదరు వ్యక్తి సొంత సంపాదన, ఆర్థికంగా ఆధారపడి ఉన్నారనే ఆధారాలపైనే పెన్షన్ అర్హత ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
జీవిత భాగస్వామికి ఆదాయ పరిమితి నుంచ మినహాయింపు
ఫ్యామిలీ పెన్షన్ దరఖాస్తులను పరిశీలించేటప్పుడు దరఖాస్తుదారుడు సొంతంగా జీవనోపాధి పొందుతున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు ప్రధానంగా చూస్తారు. అయితే, చట్టబద్ధంగా వివాహమైన జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) విషయంలో ఈ నిబంధన వర్తించదు. వారికి ఆదాయ పరిమితి నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. అంటే జీవిత భాగస్వామికి సొంతంగా ఎంత ఆదాయం ఉన్నా ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. కానీ, పిల్లలు లేని వితంతువు రెండో వివాహం చేసుకుంటే మాత్రం ఈ మినహాయింపు రద్దవుతుంది. అప్పుడు ఆమెకు కూడా మిగిలిన కుటుంబ సభ్యులకు వర్తించే ఆదాయ పరిమితి నిబంధనలే అమలవుతాయి.
మిగిలిన కుటుంబ సభ్యులకు రూ.9 వేల ఆదాయ పరిమితి
కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు, 2021లోని రూల్ 50(11) ప్రకారం మిగిలిన కుటుంబ సభ్యులకు కచ్చితమైన ఆదాయ పరిమితిని నిర్ణయించారు. జీవిత భాగస్వామిని మినహాయిస్తే, పెన్షన్‌కు అర్హులైన ఇతర కుటుంబ సభ్యులు లేదా రెండో పెళ్లి చేసుకున్న సంతానం లేని వితంతువు నెలవారీ ఆదాయం 9,000 రూపాయలు, దానికి తోడయ్యే కరువు భత్యం (డీఆర్) కంటే తక్కువగా ఉండాలి. ఇందులో ఫ్యామిలీ పెన్షన్ మొత్తాన్ని కలపకుండా, ఇతర మార్గాల ద్వారా వచ్చే సొంత సంపాదనను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఇస్తున్న కనీస ఫ్యామిలీ పెన్షన్ 9,000 రూపాయలకు సమానంగా ఈ పరిమితిని నిర్ణయించారు.
దివ్యాంగ పిల్లలు, తోబుట్టువులకు ప్రత్యేక నిబంధన
శారీరక లేదా మానసిక దివ్యాంగులైన పిల్లలు, తోబుట్టువుల విషయంలో కేంద్రం కాస్త భిన్నమైన నిబంధనను రూపొందించింది. ఫ్యామిలీ పెన్షన్ కాకుండా ఇతర వనరుల ద్వారా వారికి వచ్చే మొత్తం ఆదాయం, వారికి దక్కాల్సిన ఫ్యామిలీ పెన్షన్ కంటే తక్కువగా ఉండాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఆ పెన్షన్ మొత్తం ఉద్యోగి చివరి వేతనంలో 30 శాతం, దానికి అదనంగా వచ్చే డీఆర్‌కు సమానంగా ఉంటుంది. అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది.
ఆ రుజువు తప్పనిసరి
కొందరు కుటుంబ సభ్యులకు కేవలం ఆదాయ పరిమితి తక్కువగా ఉంటే సరిపోదు, ఉద్యోగి బతికున్నప్పుడు తాము పూర్తిగా వారిపైనే ఆధారపడి జీవించామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. పెళ్లికాని, వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలు తమ తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారిపైనే ఆధారపడ్డామని ఆధారాలు చూపాలి. అదేవిధంగా తల్లిదండ్రులు, దివ్యాంగ తోబుట్టువులు కూడా ఉద్యోగి మరణించడానికి సరిగ్గా ముందు వరకు వారి సంపాదనపైనే ఆధారపడి బతికామని ధృవీకరించాలి. ఈ ఆర్థిక నిర్భరతను లెక్కించేటప్పుడు కూడా సాధారణ సభ్యులకు రూ.9,000లు ప్లస్ డీఆర్, దివ్యాంగులకు చివరి జీతంలో 30 శాతం ప్లస్ డీఆర్ పరిమితినే ప్రామాణికంగా తీసుకుంటారు.