RBI : ఆర్బీఐకి కొత్త సమస్య.. దీపావళి ముందు అగిపోయిన వ్యాపార చెల్లింపులు

దీపావళి ముందు అగిపోయిన వ్యాపార చెల్లింపులు

Update: 2025-10-18 12:20 GMT

 RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 4న కొత్త చెక్ క్లియరింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా చెక్‌లు అదే రోజు క్లియర్ అవుతాయని ప్రకటించారు. అయితే, ఆచరణలో దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. సేమ్ డే క్లియరింగ్‎కు బదులుగా, ఒక చెక్ క్లియర్ అవ్వడానికి ఏకంగా 10 నుంచి 12 రోజులు పడుతోంది. ఈ కారణంగా వ్యాపారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై సీటీఐ సంస్థ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

సీటీఐ ఛైర్మన్ బ్రజేష్ గోయల్ మాట్లాడుతూ.. ఒకే రోజులో చెక్ క్లియర్ అయ్యే సదుపాయం ఇప్పుడు వ్యాపారులకు, సాధారణ ప్రజలకు పెద్ద భారంగా మారిందని తెలిపారు. ఆర్బీఐ ప్రకటన చేసినప్పుడు వ్యాపారులు దీన్ని స్వాగతించారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైందని ఆయన చెప్పారు. బ్యాంకులను సంప్రదిస్తే.. "టెక్నికల్ గ్లిచ్ ఉంది, కొత్త సిస్టమ్‌పై సిబ్బందికి పూర్తి శిక్షణ లేదు" అనే సమాధానమే వస్తోంది. సరిగ్గా దీపావళి వంటి ముఖ్యమైన పండుగ సమయంలో కొత్త చెక్ క్లియరింగ్ సిస్టమ్ వల్ల వ్యాపార కార్యకలాపాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వ్యాపారుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఆర్డర్‌లు రద్దు అవుతున్నాయి. ఈ బిజీ సమయంలో వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

మొదట్లో ఒక రోజులో చెక్ క్లియర్ అవ్వడం వల్ల పనులు వేగవంతం అవుతాయని భావించారు. కానీ ప్రకటన వచ్చినప్పటి నుంచే బ్యాంక్‌లలో చెక్ క్లియరెన్స్ సిస్టమ్ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని బ్యాంక్‌లలో అయితే, 15 రోజుల క్రితం డిపాజిట్ చేసిన చెక్‌లు కూడా ఇప్పటివరకు క్లియర్ కాలేదు. అంతేకాకుండా, చాలా బ్యాంకులు అసలు చెక్‌లు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నాయి. ఇప్పుడే చెక్‌లు జమ చేయవద్దు అని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. దీనివల్ల వ్యాపారుల మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. చాలా మంది చెక్‌లకు బదులుగా RTGS లేదా NEFT ద్వారా చెల్లింపులు చేయమని కోరుతున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా ప్రజల చేతుల్లోకి డబ్బు రాకపోవడంతో, పండుగ కొనుగోళ్లు, చెల్లింపులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. నగదు కొరత కారణంగా మార్కెట్లో ఇబ్బందులు నెలకొన్నాయి. కొన్ని బ్యాంక్‌లలో కేవలం చెక్ క్లియరెన్స్‌కే కాదు, NEFT, UPI ద్వారా పేమెంట్స్ చేసే వారికి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఆన్‌లైన్ పేమెంట్ సదుపాయం కోసం యాప్‌లు అప్‌డేట్ అవుతున్నాయని బ్యాంక్ సిబ్బంది చెప్పడమే. మొత్తంమీద కొత్త చెక్ క్లియరింగ్ సిస్టమ్ ప్రస్తుతానికి వరం కాదు, పెద్ద శాపంగా మారిందనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో బలంగా ఉంది.

Tags:    

Similar News