Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆయన నికర ఆస్తి విలువ మళ్లీ ట్రిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఒక్క రోజే ఆయన సంపద ఏకంగా 65 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6.26 లక్షల కోట్లు) పెరగడం విశేషం. ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఆస్తి ఏకంగా 120 శాతం పెరిగి ప్రపంచ వ్యాపార వర్గాలను విస్తుపోయేలా చేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద సోమవారం ఒక్క రోజే 65 బిలియన్ డాలర్లు పెరిగి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన ఆస్తిలో 589 బిలియన్ డాలర్ల మేర కలసి వచ్చింది. ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న లారీ పేజ్, జెఫ్ బెజోస్‌ల మొత్తం సంపదను (571 బిలియన్ డాలర్లు) కలిపినా కూడా మస్క్ ఒక్క ఏడాదిలో సంపాదించిన పెరుగుదల కంటే తక్కువగా ఉండటం విశేషం.

రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్లిన స్పేస్ ఎక్స్, టెస్లా షేర్లు

మస్క్ సంపద ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం ఆయన నేతృత్వంలోని స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల దూకుడే. అక్టోబర్ నెలలోనే స్పేస్ ఎక్స్ షేర్లు 13.4 శాతం, టెస్లా షేర్లు 7.64 శాతం మేర లాభపడ్డాయి. మస్క్ మొత్తం ఆస్తిలో 98 శాతానికి పైగా ఈ రెండు కంపెనీల వాటాలే కావడం గమనార్హం.

మోర్గాన్ స్టాన్లీ భరోసా

అంతరిక్ష, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో స్పేస్ ఎక్స్ భవిష్యత్తు చాలా బలంగా ఉందని దిగ్గజ ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు నివేదిక ఇవ్వడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి మరింత పెరిగింది. దీనికితోడు మూడో త్రైమాసికంలో టెస్లా కార్ల విక్రయాలు అంచనాలకు మించి నమోదు కావడంతో షేర్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఆగస్టు నెల కనిష్ట స్థాయిల నుంచి ఈ కంపెనీల షేర్లు ఏకంగా 58 శాతం మేర కోలుకున్నాయి.

మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి

55 ఏళ్ల టెక్ దిగ్గజం మస్క్ సంపద 13 అంకెల (ట్రిలియన్) స్థాయికి చేరడం మూడు నెలల్లో ఇది రెండోసారి. స్పేస్ ఎక్స్ రికార్డు స్థాయి ఐపీఓ సమయంలో జూన్ నెలలో ఆయన తొలిసారి ట్రిలియనీర్‌గా నిలిచారు. ఆ తర్వాత షేర్ల ధరలు తగ్గి జూలై చివరినాటికి సంపదలో 600 బిలియన్ డాలర్లు తగ్గినా, కేవలం కొన్ని వారాల్లోనే తిరిగి కోలుకుని మళ్లీ తన నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

Tags: