Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్‌లోకి విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs/FPIs) మళ్లీ భారీగా తిరిగి వస్తారనే ఆశలకు గండి పడింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశీయ మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లు సాగించిన విదేశీ ఇన్వెస్టర్లు, సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి మళ్లీ తమ పంథాను మార్చుకున్నారు. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 19 నాటికి విదేశీ మదుపరులు ఏకంగా రూ.23,676 కోట్ల విలువైన షేర్లను విక్రయించి బయటికి వెళ్లిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి నుంచి జూన్ వరకు కూడా వీరు భారీగా అమ్మకాలు చేపట్టిన విషయం తెలిసిందే. మార్చి నెల ఒక్క నెలలోనే దాదాపు రూ.1.15 లక్షల కోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. తాజా పరిణామాలు మార్కెట్ నిపుణులలో మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి.

సెకండరీ మార్కెట్‌కు దూరంగా.. ఐపీఓల వైపు ఆసక్తి

ఒకవైపు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన రెగ్యులర్ కంపెనీల షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయిస్తుంటే, మరోవైపు కొత్త కంపెనీల ఐపీఓల విషయంలో మాత్రం వారు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రైమరీ మార్కెట్ పట్ల వారి నమ్మకం ఇంకా సడలలేదు. సెప్టెంబర్ 19 వరకు కేవలం ప్రైమరీ మార్కెట్ ద్వారానే విదేశీ మదుపరులు రూ.2,703 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది మొత్తంగా చూస్తే ఐపీఓ మార్కెట్లోకి దాదాపు రూ.48,550 కోట్ల విదేశీ మూలధనం వచ్చి చేరింది. రెగ్యులర్ క్యాష్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, కొత్త కంపెనీల పబ్లిక్ ఇష్యూలలో మాత్రం విదేశీ కేపిటల్ నిరంతరం ప్రవహిస్తూనే ఉంది.

పెట్టుబడుల విత్ డ్రాకు అసలు కారణాలు ఏమిటి?

విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకోవడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమవుతున్నాయి. అమెరికాలో బాండ్ల ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి వస్తుండటంతో, విదేశీ మదుపరులు భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని అక్కడ సురక్షితమైన బాండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. దీనికి తోడు ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ కరెన్సీ రూపాయి విలువ బలహీనపడటం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది.

దేశీయ మదుపరుల అద్భుతమైన మద్దతు

విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా అమ్మకాలకు పాల్పడుతున్నప్పటికీ, మన దేశీయ సంస్థాగత మదుపరులు మాత్రం మార్కెట్‌ను కుప్పకూలకుండా గట్టిగా కాపాడుతున్నారు. విదేశీ మదుపరులు నిరంతరం షేర్లు అమ్ముతున్నప్పటికీ, మన దేశీయ మ్యూచువల్ ఫండ్లు, ఇతర సంస్థలు భారీ మొత్తంలో కొనుగోళ్లు చేపడుతున్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో దేశీయ ఇన్వెస్టర్లు సుమారు రూ.36,219 కోట్ల వరకు కొనుగోళ్లు జరిపి మార్కెట్‌కు బలమైన అండగా నిలిచారు. ఈ దేశీయ కొనుగోళ్ల మద్దతు కారణంగానే నిఫ్టి సూచీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిందని, లేదంటే మార్కెట్ మరింత భారీ పతనానికి గురై ఉండేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags: