Global Economy: 2027లో వడ్డీ భారం పెరిగినా.. ప్రపంచ అప్పుల సంక్షోభం రాదు: యూబీఎస్
| యూబీఎస్
Global Economy: ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు 2027 సంవత్సరం కాస్త సవాలుగానే ఉండబోతోంది. ప్రభుత్వ అప్పుల భారం, వాటిని తీర్చడానికి అయ్యే వడ్డీ ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం(గ్లోబల్ డెట్ క్రైసిస్) వచ్చే ప్రమాదం చాలా తక్కువని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులు, అప్పుల నిర్మాణం, ప్రభుత్వాల వద్ద ఉన్న విధానపరమైన ప్రత్యామ్నాయాలు ఈ సవాలును ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది.
పాత అప్పుల రీఫైనాన్సింగ్, ఖర్చులతో ఖజానాపై ఒత్తిడి
2020-21 కరోనా సమయంలో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు భారీగా అప్పులు చేశాయి. ఇప్పుడు ఆ పాత అప్పులను ప్రస్తుత అధిక వడ్డీ రేట్ల వద్ద మళ్లీ రీఫైనాన్స్ చేయాల్సి రావడం వల్ల ప్రభుత్వాలపై వడ్డీ భారం పెరుగుతోంది. దీనికి తోడు వృద్ధుల జనాభా పెరగడం, సంక్షేమ పథకాల ఖర్చు, పెరుగుతున్న రక్షణ రంగ అవసరాలు కూడా ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు కేంద్ర బ్యాంకులు ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను తగ్గించడంతో, ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్లపైనే ప్రభుత్వ అప్పులకు నిధులు సమకూర్చే బాధ్యత ఎక్కువగా పడింది.
భారీ సంక్షోభం ఎందుకు రాదు?
ఒక దేశం అప్పు తీర్చగల సామర్థ్యాన్ని కేవలం దానిపై ఉన్న మొత్తం అప్పును బట్టే కాకుండా, మార్కెట్ నుంచి నిధులు ఎంత సులభంగా దొరుకుతున్నాయనే అంశంతో కొలుస్తారని యూబీఎస్ వివరించింది. అలాగే దేశ ఆర్థిక వృద్ధి రేటుకు, అప్పులపై చెల్లిస్తున్న వడ్డీ రేటుకు మధ్య ఉన్న తేడా కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి చెందిన ప్రధాన దేశాలన్నింటి ఆర్థిక బలం, విధానాలు ఒకేలా లేవు కాబట్టి, ఒకేసారి అన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం చాలా తక్కువని నివేదిక అభిప్రాయపడింది.
ప్రభుత్వాల ముందున్న మార్గాలు
పెరుగుతున్న వడ్డీ ఖర్చుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు కొన్ని వ్యూహాలను అనుసరించవచ్చు. అప్పుల జారీ విధానాన్ని మార్చడం, పాత బాండ్లను తిరిగి కొనుగోలు చేయడం(బాండ్ బైబ్యాక్), దేశీయ ఆర్థిక సంస్థలు, పెన్షన్ ఫండ్లను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడం లాంటి చర్యలు తీసుకోవచ్చు. అయితే ప్రభుత్వ బాండ్ల వేలంలో తగినంత మంది కొనుగోలుదారులు రాకపోయినా, ఇన్వెస్టర్లు ఎక్కువ రాబడి డిమాండ్ చేసినా, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వాలు కఠిన రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోయినా ముప్పు పెరిగే అవకాశం ఉందని యూబీఎస్ హెచ్చరించింది.
ఇన్వెస్టర్లకు యూబీఎస్ ఇచ్చిన కీలక సలహా ఇదే
ప్రస్తుత పరిస్థితుల్లో బాండ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని యూబీఎస్ సూచించింది. దీర్ఘకాలిక (లాంగ్-టర్మ్) బాండ్ ఈల్డ్స్ భారీగా పడిపోతాయనే అంచనాతో వ్యూహాలు రచించవద్దని స్పష్టం చేసింది. దీనికి బదులుగా నాణ్యమైన స్వల్పకాలిక (షార్ట్-టర్మ్), మధ్యకాలిక (మీడియం-టర్మ్) బాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సలహా ఇచ్చింది. దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడిని పరిమితం చేస్తూ, వేర్వేరు దేశాలు, కరెన్సీలను ఎంచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ అప్పులు ఇలాగే పెరిగితే భవిష్యత్తులో కరెన్సీ విలువలు, అసలు రాబడులపై ప్రభావం పడొచ్చని నివేదిక తెలిపింది.