Tax Collection : డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లలో దూకుడు.. రూ. 12 లక్షల కోట్లకు చేరిన ప్రభుత్వ ఆదాయం
రూ. 12 లక్షల కోట్లకు చేరిన ప్రభుత్వ ఆదాయం
Tax Collection : దేశంలో రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పన్ను వసూళ్లలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. కార్పొరేట్ పన్ను వసూళ్లలో పెరుగుదల, పన్ను రిఫండ్‌ల తగ్గింపు కారణంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 నాటికి డైరెక్ట్ ట్యాక్స్ వసూలు ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 12 లక్షల కోట్ల ఆదాయం లభించింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 వరకు నెట్ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు 6.33 శాతం పెరిగి రూ. 11.89 లక్షల కోట్లకు పైగా చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఈ వసూళ్లు దాదాపు రూ. 11.18 లక్షల కోట్లుగా ఉండేవి. కార్పొరేట్ పన్ను వసూళ్లలో గణనీయమైన పెరుగుదల, రిఫండ్‌ల తగ్గింపు కారణంగానే ఈ వృద్ధి నమోదైంది.
ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 12 వరకు) జారీ చేసిన మొత్తం పన్ను రిఫండ్‌లు 16 శాతం తగ్గి రూ. 2.03 లక్షల కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌ల తగ్గింపు కూడా ప్రభుత్వ నికర వసూళ్లు పెరగడానికి ఒక ప్రధాన కారణం. కాగా, అక్టోబర్ 12 వరకు రిఫండ్‌లను సర్దుబాటు చేయకముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 13.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరం కంటే 2.36 శాతం అధికం.
నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు ఈ ఏడాది అక్టోబర్ 12 వరకు దాదాపు రూ. 5.02 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 4.92 లక్షల కోట్లుగా ఉండేది. మరోవైపు, వ్యక్తిగత ఆదాయ పన్ను వంటి నాన్-కార్పొరేట్ పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. సమీక్షా కాలంలో ఇవి దాదాపు రూ. 6.56 లక్షల కోట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో రూ. 5.94 లక్షల కోట్లుగా ఉన్నాయి.
సెక్యూరిటీ మార్కెట్‌లలో లావాదేవీల (ట్రాన్సాక్షన్)పై విధించే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వసూళ్లలో కూడా పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది అక్టోబర్ 12 వరకు STT వసూళ్లు రూ. 30,878 కోట్లుగా నమోదయ్యాయి, గత ఏడాది ఇది రూ. 30,630 కోట్లుగా ఉండేది. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మొత్తం రూ. 25.20 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది లక్ష్యం కంటే 12.7 శాతం అధికం.