GST: NBFC కో-లెండింగ్పై 18 శాతం జీఎస్టీ ? బ్యాంకింగ్ రంగానికి బిగ్ అప్డేట్
బిగ్ అప్డేట్
GST: దేశంలో రుణ వితరణను వేగవంతం చేసేందుకు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) కలిసి కో-లెండింగ్ నమూనాలో పనిచేస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు లోన్లు అందించడంలో ఈ విధానం ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ భాగస్వామ్య సేవలకు సంబంధించిన పన్ను విధింపుపై దీర్ఘకాలంగా ఉన్న సందేహాలకు తెరదించేందుకు జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బ్యాంకింగ్ రంగానికి NBFCలు అందించే సేవలపై 18 శాతం జిఎస్‌టి విధించాలని సిఫార్సు చేసింది.
కస్టమర్ల వడ్డీపై జీఎస్టీ భారం లేదు
సాధారణ రుణగ్రహీతలకు ఊరటనిచ్చే విషయమేమిటంటే.. ఈ కొత్త పన్ను ప్రతిపాదన వల్ల లోన్ అసలు వడ్డీపై ఎలాంటి అదనపు భారం పడదు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే మూల వడ్డీని పన్ను పరిధి నుంచి పూర్తిగా మినహాయించారు. ఉదాహరణకు ఒక కస్టమర్‌కు 16 శాతం వడ్డీతో లోన్ ఇస్తే, అందులో బ్యాంక్ వాటా 10 శాతం, ఎన్‌బిఎఫ్‌సి వాటా 6 శాతంగా ఉంటుంది. ఈ 6 శాతం మార్జిన్‌ను గతంలో వడ్డీగా భావించాలా లేక సేవా రుసుముగా చూడాలా అనే అంశంపై వివాదం ఉండేది. దీనిపై స్పష్టత ఇస్తూ, ఎన్‌బిఎఫ్‌సిలు బ్యాంకులకు అందించే సేవగా భావించి దానిపై మాత్రమే 18 శాతం జిఎస్‌టి వర్తింపజేయాలని కమిటీ పేర్కొంది.
ఆర్‌బిఐ నిబంధనలతో సేవల విలువ నిర్ధారణ
ఈ సేవా రుసుము విలువను ఎలా లెక్కించాలనే అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. కస్టమర్లను ఆకర్షించడం, పత్రాల పరిశీలన, రుణ వసూళ్ల వంటి సేవల విలువ ఆర్‌బిఐ రూల్స్ ఆధారంగానే ఖరారవుతుంది. పన్ను శాఖ, ఫైనాన్స్ కంపెనీల మధ్య ఉన్న పాత వివాదాలను, సుదీర్ఘ న్యాయపోరాటాలను ముగించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. నిబంధనలలో పారదర్శకత రావడం వల్ల ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు, బ్యాంకులు ఎలాంటి చట్టపరమైన భయాలు లేకుండా ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమవుతుంది.
బ్యాంక్ శాఖల అంతర్గత బదిలీలకు పన్ను మినహాయింపు
కో-లెండింగ్ సేవలపై సూచనలతో పాటు బ్యాంకుల అంతర్గత లావాదేవీలకు సంబంధించిన మరొక ముఖ్యమైన సవరణను ఫిట్‌మెంట్ కమిటీ తెచ్చింది. బ్యాంకులు తమ సొంత శాఖల మధ్య నిధులు బదిలీ చేసుకునేటప్పుడు ఖాతాల్లో నమోదయ్యే టెక్నికల్ లేదా నోషనల్ ఛార్జీలను కూడా వడ్డీగానే పరిగణించాలని సూచించింది. దీనివల్ల బ్యాంకులు తమ సొంత బ్రాంచీల మధ్య జరిపే డిపాజిట్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ లావాదేవీలపై ఎలాంటి అదనపు పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఆఖరి నిర్ణయం
ఫిట్‌మెంట్ కమిటీ సిద్ధం చేసిన ఈ నివేదికను తుది ఆమోదం కోసం జీఎస్టీ కౌన్సిల్ ముందు ఉంచనున్నారు. కౌన్సిల్ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి అధికారిక నిర్ణయం ప్రకటిస్తారు. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై ప్రత్యేక సర్క్యులర్ జారీ చేస్తుంది. ఆ తర్వాతే ఈ నూతన పన్ను మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి.