Insurance Jobs: ఇన్సూరెన్స్ ఏజెంట్లకు షాక్.. 10 లక్షల జాబ్‌లు గోవిందా
గోవిందా
Insurance Jobs: భారత ఇన్సూరెన్స్ రంగంలో భారీ ప్రకంపనలు సృష్టిస్తూ కొత్త సంస్కరణల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తీసుకురావాలనుకుంటున్న కొత్త విధానాల వల్ల రంగానికి చెందిన మధ్యవర్తులు, బ్రోకరేజ్ సంస్థల రాబడి ఏకంగా 70 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశముందని ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IBAI) తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఐబీఏఐ వర్సెస్ IRDAI.. ప్లాన్ ఏంటి?
ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు IRDAI రీకాలిక్యులేటింగ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. కస్టమర్లకు మేలు చేయడమే లక్ష్యంగా కమిషన్లు, ఖర్చులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, మార్కెట్ నిర్వహణలో పారదర్శకత తెచ్చేలా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. అయితే 800 పైగా సభ్యులు ఉన్న ఐబీఏఐ మాత్రం ఈ మార్పులు అమలులోకి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు ఏజెంట్లు, బ్రోకర్లు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరిస్తోంది.
ఆదాయంలో 70 శాతం కోత
కొత్త రూల్స్ వర్తిస్తే బ్రోకరేజ్ ఫర్మ్‌ల రాబడి భారీగా క్షీణించి నిర్వహణ ఖర్చులు కూడా వెళ్లదీయలేని పరిస్థితి వస్తుందని ఐబీఏఐ డైరెక్టర్ పవన్‌జీత్ సింగ్ ధీంగ్రా తెలిపారు. కమిషన్ పరిమితులు తగ్గించడం వల్ల ఫీల్డ్‌లో పనిచేసే లక్షలాది మంది ఏజెంట్లు ఉపాధి కోల్పోతారని స్పష్టం చేశారు. మ్యూచువల్ ఫండ్స్ తరహాలో కాకుండా ఇన్సూరెన్స్‌కు ప్రతి ఏటా రెగ్యులర్ సర్వీసింగ్, క్లెయిమ్ సెటిల్మెంట్ సాయం అవసరమవుతాయని, సరైన ఆదాయం లేకపోతే ఏజెంట్లు కస్టమర్లకు సేవలు అందించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.
డెడ్‌లైన్ డిసెంబర్ వరకు పెంచాలని డిమాండ్
ఇర్డాయ్ చీఫ్ అజయ్ సేత్ ఈ ప్రతిపాదనలను సమర్థిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తున్న అధిక కమిషన్లకు అడ్డుకట్ట వేయడం అత్యవసరమని పేర్కొన్నారు. కానీ ఈ అంశంపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఇచ్చిన సమయం చాలా తక్కువగా ఉందని, కనీసం రెండు నెలల సమయం పొడిగించి డిసెంబర్ వరకు అవకాశమివ్వాలని ఐబీఏఐ కోరింది. నియంత్రణ సంస్థ ఉద్దేశాలు మంచివే అయినా, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే దేశంలో ఇన్సూరెన్స్ పరిధి దెబ్బతింటుందని వాపోతున్నారు.
శుక్రవారం కీలక భేటీ
ఈ కొత్త ప్రతిపాదనల వల్ల తలెత్తే పరిణామాలపై చర్చించేందుకు ఐబీఏఐ అధికారులు IRDAI ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశం కానున్నారు. తమ ఆందోళనలను, బ్రోకర్లు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను రెగ్యులేటర్‌కు నివేదించనున్నారు. ఇరు వర్గాల మధ్య చర్చల ద్వారా సంస్కరణలు దెబ్బతినకుండా, అలాగే లక్షలాది మంది ఉద్యోగాలు పోకుండా సమతుల్యమైన నిర్ణయం వెలువడుతుందని ఇన్సూరెన్స్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.