Indian Economy: అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్(WEO) నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశీయంగా ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్నప్పటికీ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడటం వల్ల 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్ మరో ఏడాది ఎక్కువ కాలం వేచి చూడాల్సి వస్తోంది. గతంలో 2028 నాటికి ఈ మైలురాయిని చేరుకుంటామని అంచనా వేయగా, ఇప్పుడు ఆ లక్ష్యం 2029 సంవత్సరానికి వాయిదా పడింది.

బలహీనపడుతున్న రూపాయి

భారతదేశం రూపాయి రూపంలో చూస్తే అద్భుతమైన ఆర్థిక పురోగతిని సాధిస్తోంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో దేశాల ఆర్థిక స్థాయిని అంచనా వేయడానికి డాలర్లలో లెక్కిస్తారు. రూపాయి పతనం కారణంగా 2028 నాటి అంచనా వేసిన నామినల్ జీడీపీ డాలర్లలో సుమారు 4.996 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2026 నాటికి భారత ఎకానమీ 4.06 ట్రిలియన్ డాలర్లు అలాగే 2027 నాటికి 4.52 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ ఆలస్యం దేశ ఆర్థిక మాంద్యం వల్ల కాకుండా పూర్తిగా మారకం విలువల్లో వచ్చిన మార్పుల వల్లే జరిగిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బ్రిటన్ అలాగే జపాన్‌లను దాటనున్న భారత్

ఈ స్వల్ప ఆలస్యం ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల ఆర్ధిక శక్తి జాబితాలో భారత్ దూసుకుపోతోంది. రాబోయే 2027 నాటికి భారత్ తన సమీప ప్రత్యర్థులైన బ్రిటన్ అలాగే జపాన్ దేశాలను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఆ సమయంలో మన దేశ జీడీపీ సుమారు 4.52 ట్రిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా భవిష్యత్ అంచనాల ప్రకారం 2031 నాటికి జర్మనీ దేశాన్ని కూడా వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా రికార్డు సృష్టించనుంది.

భవిష్యత్ అంచనాలు

డాలర్ల లెక్కల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ, దేశీయంగా మాత్రం ఆర్ధిక కార్యకలాపాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయి. బలంగా ఉన్న దేశీయ డిమాండ్ కారణంగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచారు. దేశ ప్రజల కొనుగోలు శక్తి అలాగే వ్యాపార వృద్ధి వేగంగా విస్తరిస్తుండటం శుభపరిణామం. రూపాయి విలువ స్థిరీకరణకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో భారత ఆర్థిక ప్రయాణం మరింత వేగంగా సాగుతుందని ఆర్ధిక విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags: