GDP Growth: భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాగిన రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ గణాంకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన 7.2 శాతం అంచనా కంటే ఎంతో ఎక్కువ కావడం విశేషం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు సంబంధించిన 54 కీలక ఆర్థిక సూచికలను విశ్లేషించిన తర్వాత ఎస్బీఐ నిపుణులు ఈ అంచనాకు వచ్చారు.

కీలక రంగాల్లో జోరు.. కొన్ని విభాగాల్లో తగ్గుదల

రెండో త్రైమాసికం చివరి నాటికి సిమెంట్ ఉత్పత్తి, కమర్షియల్ వాహనాల అమ్మకాలు, నాన్-ఆయిల్ ఎగుమతులు, ఓడరేవుల కార్గో రవాణాలో గణనీయమైన వృద్ధి కనిపించింది. మరోవైపు మైనింగ్ ఉత్పత్తి, ట్రాక్టర్ల విక్రయాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టాయి. జూన్‌లో 11.9 శాతం పెరిగిన ట్రాక్టర్ల అమ్మకాలు సెప్టెంబర్ నాటికి 18.1 శాతం తగ్గాయి. అయినప్పటికీ దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉండటం వల్ల రియల్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (GVA) వృద్ధి రేటు 8 నుంచి 8.2 శాతం మధ్య స్థిరంగా కొనసాగుతుందని నివేదిక స్పష్టం చేసింది.

11.5 శాతానికి చేరనున్న నామినల్ జీడీపీ వృద్ధి

ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా లెక్కించే నామినల్ జీడీపీ వృద్ధి రేటులో భారీ పెరుగుదల నమోదు కానుంది. జూన్ త్రైమాసికంలో 10.3 శాతంగా ఉన్న ఈ వృద్ధి, సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 11 నుంచి 11.5 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని ఎస్బీఐ అంచనా వేసింది. ఈ కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు సగటున 7.8 శాతం మేర పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. అయితే వ్యవసాయ అనుబంధ రంగాల వాస్తవ వృద్ధి రేటు మాత్రం 3.6 శాతం నుంచి 2.8 శాతానికి పరిమితం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

తయారీ, సేవా రంగాల పనితీరు

దేశీయ తయారీ రంగం రెండో త్రైమాసికంలో 8.7 శాతం వాస్తవ వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక పేర్కొంది. ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ, ఉత్పత్తిదారులు ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా తట్టుకోగలిగారు. అటు సేవా రంగం వృద్ధి గత త్రైమాసికంలోని 10 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 9.7 శాతంగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాలలో మొత్తం జీడీపీ వృద్ధి రేటు కాస్త నెమ్మదించి సుమారు 6.9 శాతం వద్ద స్థిరపడవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషించింది.

Tags: