India Russia Trade : భారత్-రష్యా స్నేహం..ఎగుమతులు పెంచడానికి 300 ప్రొడక్టులు గుర్తింపు

ఎగుమతులు పెంచడానికి 300 ప్రొడక్టులు గుర్తింపు

Update: 2025-12-15 06:38 GMT

India Russia Trade : భారతదేశం, రష్యా మధ్య ఉన్న బంధం చాలా పురాతనమైనది.. బలమైనది. ఈ స్నేహం ఇరు దేశాల మధ్య వ్యాపారంపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యాపారాన్ని మరింత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, రసాయనాలు వంటి రంగాలలో దాదాపు 300 ఉత్పత్తులను భారత్ గుర్తించింది. ఈ ఉత్పత్తులను భారతీయ ఎగుమతిదారులు రష్యా మార్కెట్‌లో తమ ఉనికిని పెంచుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశంగా ఉపయోగించుకోనున్నారని ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.

ఇరు దేశాలు 2030 నాటికి తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా పనిచేస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం భారత్ గుర్తించిన 300 ఉత్పత్తుల విభాగంలో రష్యా మొత్తం $37.4 బిలియన్ల దిగుమతులు చేసుకుంటుంటే, అందులో భారత్ కేవలం $1.7 బిలియన్ల ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేస్తోంది. ఈ అంతరం చాలా పెద్దదిగా ఉంది. అందుకే భారత్ ఈ భారీ ఎగుమతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.

ఈ ఎగుమతులను పెంచడం ద్వారా భారత్-రష్యా మధ్య ఉన్న $59 బిలియన్ల వాణిజ్య లోటును తగ్గించడం కూడా భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ రష్యా దిగుమతి డిమాండ్‌కు అనుగుణంగా భారతదేశ సరఫరాను పెంచడానికి ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ, రసాయన ఉత్పత్తులతో సహా అనేక హై-పొటెన్షియల్ ఉత్పత్తులను షార్ట్‌లిస్ట్ చేసింది.

పీటీఐ నివేదిక ప్రకారం.. రష్యా మొత్తం దిగుమతుల్లో భారతదేశ వాటా కేవలం 2.3 శాతం మాత్రమే. అయితే, రష్యా నుంచి భారతదేశానికి దిగుమతులు మాత్రం నిరంతరం పెరుగుతున్నాయి. 2020లో $5.94 బిలియన్లుగా ఉన్న దిగుమతులు 2024 నాటికి $64.24 బిలియన్లకు చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం ముడి చమురు దిగుమతులు విపరీతంగా పెరగడమే. ముడి చమురు దిగుమతులు 2020లో $2 బిలియన్ల నుంచి 2024లో $57 బిలియన్లకు పెరిగాయి. ప్రస్తుతం భారతదేశం రష్యా నుంచి మొత్తం దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 21 శాతం రష్యా నుంచే వస్తోంది.

Tags:    

Similar News