Russian Oil Imports : అమెరికా హెచ్చరికలు బేఖాతర్.. రష్యా చమురు కొనుగోలులో భారత్ కొత్త రికార్డు

రష్యా చమురు కొనుగోలులో భారత్ కొత్త రికార్డు

Update: 2025-12-12 05:40 GMT

Russian Oil Imports : భారతదేశం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలులో కొత్త రికార్డును నెలకొల్పింది. తాజా గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 2025 లో రష్యా నుంచి భారతదేశ చమురు దిగుమతి ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. దీనితో సముద్ర మార్గం ద్వారా రష్యా చమురును కొనుగోలు చేసే ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా భారతదేశం నిలిచింది. రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించాలని అమెరికా భారతదేశంపై నిరంతరం ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఈ పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా వైఖరి మరింత కఠినంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% అదనపు టారిఫ్ విధించారు. దీనితో భారతీయ ఎగుమతిదారులపై పడే మొత్తం పన్ను ప్రపంచంలోనే అత్యధికంగా 50% వరకు చేరింది. ఇంతటి ఒత్తిడి, ఆర్థిక భారం ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం తన శక్తి అవసరాల కోసం రష్యా చమురుపై ఆధారపడటం కొనసాగిస్తోంది.

గ్లోబల్ కమోడిటీ ఇంటెలిజెన్స్ సంస్థ క్యాప్లర్ షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. డిసెంబర్‌లో భారతదేశం రష్యా చమురు దిగుమతులు రోజుకు 1.85 మిలియన్ బ్యారెల్స్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇది నవంబర్‌లో ఉన్న 1.83 mbd కంటే ఎక్కువ. అంటే వరుసగా మూడో నెలా భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలును పెంచుతోంది. అక్టోబర్‌లో దిగుమతి 1.48 mbd ఉండగా, నవంబర్‌లో అది 1.83 mbd కి పెరిగింది. డిసెంబర్ అంచనా 2025 జూన్ తర్వాత (2.10 mbd) అత్యధికంగా ఉంది.

రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు, భారతదేశం-రష్యా చమురు వ్యాపారంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఇంధన నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ చమురు ఆర్థికవేత్త డాక్టర్ మమదౌహ్ జీ సలామెహ్ ప్రకారం.. ఆంక్షల మధ్య కూడా చమురు అమ్మకాలకు రష్యాకు దీర్ఘకాల అనుభవం ఉంది. పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థపైనా, దాని చమురు, గ్యాస్ ఎగుమతులపైనా ప్రభావం చూపలేదని ఆయన పేర్కొన్నారు. రష్యా చమురు ఇంకా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరుతోందని ఆయన ధృవీకరించారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం, రష్యా మధ్య ఉన్న ఇంధన సహకారం కేవలం వ్యాపార అవసరం మాత్రమే కాదు, ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా. అమెరికా ఒత్తిడి, ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతల మధ్య కూడా భారతదేశం తన ఎనర్జీ సెక్యూరిటీకి తొలి ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుంది.

Tags:    

Similar News