Tax Collection: దూసుకుపోతున్న భారత్.. 13 శాతం పెరిగిన డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్, రూ. 12.10 లక్ష కోట్లకు చేరిక!
రూ. 12.10 లక్ష కోట్లకు చేరిక!
Tax Collection: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై మాంద్యం నీడలు కమ్ముకుంటున్న వేళ, భారతీయ ఆర్థిక రంగం మాత్రం ఎలాంటి భయాలు లేకుండా దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన గణాంకాలు దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో పటిష్టంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారతదేశం నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ వార్షిక ప్రాతిపదికన దాదాపు 13 శాతం వృద్ధితో రూ.12.10 లక్ష కోట్ల మైలురాయిని తాకింది. మొదటి త్రైమాసికపు జీడీపీ గణాంకాలు, జీఎస్‌టీ వసూళ్లు ఆశాజనకంగా ఉండటమే కాకుండా ఈ డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు కూడా దేశ ఆర్థిక పురోగతికి బలమైన సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల్లో వచ్చిన విపరీతమైన పెరుగుదలే అని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 17 నాటికి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఏకంగా 16.18 శాతం పెరిగి రూ.5.22 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కార్పొరేట్ అడ్వాన్స్ ట్యాక్స్ సుమారు 18.09 శాతం వద్ధితో రూ.4.16 లక్షల కోట్లకు ఎగబాకగా, నాన్-కార్పొరేట్ అడ్వాన్స్ ట్యాక్స్ 9.24 శాతం పెరిగి రూ.1.06 లక్షల కోట్లకు చేరింది. గ్లోబల్ స్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, దేశంలోని వ్యాపార సంస్థలు, వ్యక్తుల ఆదాయాలు నిలకడగా పెరుగుతున్నాయనేదానికి ఈ గణాంకాలే నిదర్శనం. దీనివల్ల ప్రభుత్వం నిర్దేశించుకున్న ట్యాక్స్ టార్గెట్లు సులభంగా నెరవేరే అవకాశం ఉంది.
మరోవైపు, ప్రభుత్వం నుంచి ట్యాక్స్ పేయర్లకు భారీగా రీఫండ్‌లు ఇచ్చినా, నెట్ ట్యాక్స్ కలెక్షన్ చాలా స్థిరమైన వేగంతో వృద్ధి చెందడం విశేషం. సీబీడీటీ వివరాల ప్రకారం రిఫండ్‌లు దాదాపు 29 శాతం పెరిగి రూ.2.20 లక్షల కోట్లకు చేరాయి. అయినప్పటికీ పన్ను వసూళ్లలో ఎలాంటి అంతరాయం కలగలేదు. ఇక మార్కెట్ పరంగా చూస్తే, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) వసూళ్లు ఏకంగా 53 శాతం పెరిగి రూ.40,214 కోట్లకు చేరుకున్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం భారీగా పెరగడం, బడ్జెట్‌లో ఎస్‌టీటీ రేట్లలో వచ్చిన మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మొత్తం మీద, ఈ గణాంకాలు భారతీయ పన్ను చెల్లింపుదారులలో పెరిగిన నమ్మకాన్ని, వ్యాపార రంగంలో చురుకుదనాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా భారత్ వృద్ధి రేటు 7 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఈ సానుకూల పరిణామాలు దేశంలో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి వృద్ధి, మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఈ ఆదాయం దేశంలోని మౌలిక వసతుల అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ఎంతగానో దోహదపడనుంది.