Family Businesses : ఫ్యామిలీ బిజినెస్‌లలో ఊహించని వృద్ధి.. ఏకంగా రూ.2.70లక్షల కోట్ల ఆదాయం
ఏకంగా రూ.2.70లక్షల కోట్ల ఆదాయం
Family Businesses : భారతదేశంలోని కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్నాయని డెలాయిట్ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో సగానికి పైగా ఫ్యామిలీ బిజినెస్‌ల వార్షిక ఆదాయం రూ.9,000 కోట్ల నుంచి రూ.2,70,000 కోట్ల మధ్య ఉంది. ఇందులో 36 శాతం కంపెనీలు $1-5 బిలియన్ల (సుమారురూ.9,000 కోట్ల నుంచి రూ.45,000 కోట్ల) పరిధిలో ఉన్నాయి. నాయకత్వంలో స్థిరత్వం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన నమ్మకం కారణంగా ఈ సంస్థలు బలమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది.
భారతదేశంలో 96 శాతం ఫ్యామిలీ బిజినెస్‌లను ఇప్పటికీ కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నారు. అయితే సగానికి పైగా కంపెనీలు ఇప్పటికే లిస్ట్ చేయబడ్డాయి. ప్రొఫెషనలిజం దిశగా అడుగులు వేస్తున్నాయి. సుమారు 51 శాతం కంపెనీలు సెకండ్-జెనరేషన్ సంస్థలు. వారసులు నాయకత్వం తీసుకునే విషయంలో ప్రణాళికలు ఈ సంస్థల ప్రధాన వ్యూహంలో భాగమైంది. అంతేకాకుండా సుమారు 53 శాతం భారతీయ ఫ్యామిలీ బిజినెస్‌లు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నాయి. ఇది వారి వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, వేగంగా మార్చడానికి సహాయపడుతుంది.
డెలాయిట్ ప్రైవేట్ ఇండియా భాగస్వామి కె.ఆర్. శేఖర్ ప్రకారం.. భారతీయ ఫ్యామిలీ బిజినెస్‌ల వృద్ధి కేవలం యాదృచ్చికం కాదు. పెట్టుబడికి మెరుగైన ప్రాప్యత (Capital Access), వారసత్వ మార్పులు, ఫ్యామిలీ ఆఫీసుల స్థాపన, మరియు పబ్లిక్ మార్కెట్ల బలం దీనికి కారణాలు. ప్రపంచవ్యాప్తంగా కూడా కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు బలంగా పెరుగుతున్నాయి. 2024లో 63 శాతం భారతీయ కంపెనీలు డబుల్-డిజిట్ ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. అలాగే, 75 శాతం సంస్థలు 2025-26లో 15 శాతం కంటే ఎక్కువ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ గణాంకాలు భారతీయ ఫ్యామిలీ బిజినెస్‌లు మారే వేగాన్ని, కుటుంబ నియంత్రణను కొనసాగిస్తూనే టెక్నాలజీ, ప్రపంచ అవకాశాలను ఉపయోగించుకుంటూ తమ వ్యాపారాన్ని ఎంతగానో పెంచుకుంటున్నాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.