Share Market : షేర్ మార్కెట్ దూకుడు.. సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్
సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్
Share Market : వారంలో మూడవ ట్రేడింగ్ రోజు అయిన అక్టోబర్ 15 బుధవారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకుంటూ, మార్కెట్ నేడు ఉత్సాహంగా మొదలైంది. ఉదయం 9:25 గంటల సమయానికి 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇండెక్స్ దాదాపు 320 పాయింట్ల పెరుగుదలతో 82,350 మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 90 పాయింట్లకు పైగా లాభపడి 25,235 వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చింది.
బుధవారం మార్కెట్ ప్రారంభంలోనే గ్రీన్ మార్క్‌తో ట్రేడింగ్ మొదలైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 167.27 పాయింట్ల (0.20%) జంప్‌తో 82,197.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అదేవిధంగా, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 50 కూడా 36.45 పాయింట్ల (0.14%) లాభంతో 25,181.95 వద్ద ఓపెన్ అయింది. 9:25 గంటల వరకు మార్కెట్ దూకుడు కొనసాగింది. బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్ వంటి స్టాక్‌లు టాప్ గెయినర్స్‌గా నిలవగా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్ స్టాక్‌లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.
వారంలో రెండవ ట్రేడింగ్ రోజు అయిన మంగళవారం (అక్టోబర్ 14) నాడు భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 297.02 పాయింట్లు (0.36%) నష్టపోయి 82,029.98 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 81.85 పాయింట్లు (0.32%) నష్టంతో 25,145.50 వద్ద ముగిశాయి. మంగళవారం దాదాపు అన్ని ఇండెక్స్‌లు, ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు రెడ్ మార్క్‌లో ముగిశాయి. ప్రపంచ హెచ్చుతగ్గులు, భారీగా జరిగిన అమ్మకాలే ఈ పతనానికి కారణమయ్యాయి.
మంగళవారం ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో మార్కెట్ స్వల్ప లాభంతో మొదలైనప్పటికీ, అమ్మకాల ఒత్తిడితో నష్టాలను మూటగట్టుకుంది. మంగళవారం నాడు బీఎస్ఈ బాస్కెట్ నుంచి టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ టాప్ గెయినర్స్‌గా నిలవగా, టీసీఎస్, బీఈఎల్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్‌లు టాప్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.