100% Ethanol Car: భారతదేశంలో ఆటోమొబైల్ రంగాన్ని పూర్తిగా మార్చివేసే ఒక సంచలన వార్తను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రాబోయే అక్టోబర్ నెలలో పూర్తిగా ఇథనాల్ ఇంధనంతో నడిచే ఒక సరికొత్త కారు లాంచ్ కానుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన కారు నడపడానికి పెట్రోల్ అవసరమే ఉండదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ సరికొత్త ఇథనాల్ కారును నడపడానికి అయ్యే ఖర్చు కేవలం లీటరుకు రూ.25 విలువైన పెట్రోల్‌తో సమానంగా ఉంటుందని తెలిపారు.

ఈ ప్రత్యేకమైన 100% ఇథనాల్ కారుకు సంబంధించి నితిన్ గడ్కరీ మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అక్టోబర్‌లో టయోటా సంస్థకు చెందిన ప్రముఖ ఇన్నోవా ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల లాంచ్ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కారు పెట్రోల్‌కు బదులుగా పూర్తిగా 100 శాతం ఇథనాల్‌పై పరుగులు తీస్తుంది. విశేషం ఏమిటంటే ఈ కారు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలోనే దాదాపు 60 శాతం విద్యుత్‌ను కూడా స్వయంగా ఉత్పత్తి చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు ఇథనాల్‌ను ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న E20 ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ వల్ల కార్ల ఇంజిన్లు పాడైపోతాయని, మైలేజ్ తగ్గిపోతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గడ్కరీ స్పందించారు. ఇప్పటివరకు భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వాడుతున్న ఏ ఒక్క వాహనం నుంచి కూడా ఎలాంటి ప్రతికూల ఫిర్యాదులు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఆటోమొబైల్ కంపెనీలు, నిపుణులు జరిపిన లాబ్ స్టడీస్, ఫ్రీ ట్రయల్స్ ఆధారంగానే ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల కార్ల ఇంజిన్లపై ఎలాంటి దుష్ప్రభావం పడదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం వెనుక రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశం ఉందని గడ్కరీ పునరుద్ఘాటించారు. మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇథనాల్ తయారు చేస్తుండటం వల్ల దేశంలోని రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా ఎనర్జీ ప్రొడ్యూసర్లుగా మారుతున్నారని చెప్పారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని, దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు ముడి చమురు దిగుమతుల భారం నుంచి విముక్తి పొందుతాయని పేర్కొన్నారు.

ఇథనాల్ కార్ల ప్రమోషన్‌తో పాటు దేశంలో బైక్ ట్యాక్సీ సేవలను మరింత విస్తృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యాప్-బేస్డ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టూ-వీలర్ యజమానులు ఎలాంటి అదనపు పెట్టుబడి లేకుండా సులభంగా ఉపాధి పొందవచ్చని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలను విస్తరింపజేస్తే కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో దేశం పూర్తిగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయడంలో ఈ నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

Tags: