Russian Oil Imports : అమెరికా హెచ్చరికలు పనికి రాలేదు..ఐదు నెలల గరిష్టానికి రష్యా చమురు దిగుమతులు
ఐదు నెలల గరిష్టానికి రష్యా చమురు దిగుమతులు
Russian Oil Imports : అమెరికా నుంచి హెచ్చరికలు, ఆంక్షలు ఉన్నప్పటికీ భారతదేశం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును భారీగా పెంచింది. గత నెల (నవంబర్)లో రష్యా నుంచి దిగుమతి ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒక యూరోపియన్ థింక్ ట్యాంక్ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) నివేదిక ప్రకారం నవంబర్‌లో భారత్ రష్యా నుంచి సుమారు EUR 2.6 బిలియన్ల విలువైన ముడి చమురును కొనుగోలు చేసింది. ఇది అక్టోబర్‌తో పోలిస్తే దాదాపు 4% ఎక్కువ.
నవంబర్‌లో రష్యా శిలాజ ఇంధనాలకు అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. రష్యా మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో చైనా వాటా 47% కాగా, భారత్ వాటా 38% ఉంది. టర్కీ, యూరప్ ఒక్కొక్కటి 6% చమురును కొనుగోలు చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు, భారతదేశం మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1% కంటే తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు, భారీ తగ్గింపు ధరల కారణంగా రష్యా వాటా ఏకంగా 40% వరకు పెరిగింది.
అక్టోబర్ 22న అమెరికా రష్యాకు చెందిన రెండు పెద్ద కంపెనీలు – రోస్‌నెఫ్ట్, లుకోయిల్ పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా రిలయన్స్, HPCL, MRPL వంటి కొన్ని భారతీయ ప్రైవేట్ రిఫైనరీ కంపెనీలు తాత్కాలికంగా కొనుగోళ్లను తగ్గించాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రం ఆంక్షలు లేని రష్యన్ సరఫరాదారుల నుంచి చమురు కొనుగోలును కొనసాగించింది. ప్రైవేట్ రిఫైనరీలు దిగుమతులను తగ్గించినప్పటికీ, ప్రభుత్వ రిఫైనరీలు నవంబర్‌లో రష్యా చమురు కొనుగోలును 22% పెంచాయి.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్, రష్యా నుంచి కొనుగోలు చేసిన ముడి చమురును కేవలం దేశీయ అవసరాల కోసం పెట్రోల్, డీజిల్ తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించడం లేదు. నవంబర్‌లో భారత్, టర్కీలకు చెందిన ఆరు రిఫైనరీలు సుమారు EUR 807 మిలియన్ల విలువైన రిఫైన్డ్ చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశాయి. వీటిలో సుమారు EUR 301 మిలియన్ల విలువైన చమురును రష్యా ముడి చమురును ప్రాసెస్ చేయడం ద్వారా తయారు చేశారు.
ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నవంబర్‌లో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు పంపబడిన ఇంధన ఎగుమతుల్లో 69% పెరుగుదల నమోదైంది. ఈ శుద్ధి చేసిన ఇంధనమంతా రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీ నుంచి పంపారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత, రష్యా ముడి చమురుతో తయారు చేసిన ఇంధనం కెనడాకు కూడా షిప్‌మెంట్ రూపంలో చేరింది. యూరోపియన్ యూనియన్ రష్యా చమురుతో తయారు చేసిన ఇంధనంపై నిషేధం విధించినప్పటికీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వంటి దేశాలు అలాంటి ఆంక్షలు విధించలేదు. ఈ కారణంగానే భారతీయ రిఫైనరీలు ఆయా దేశాలకు సులభంగా ఇంధనాన్ని ఎగుమతి చేయగలుగుతున్నాయి.