ITR : ఐటీఆర్ గడువు పొడిగింపు.. జులై 31 తర్వాత సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్ కడితే పెనాల్టీ పడుతుందా?
జులై 31 తర్వాత సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్ కడితే పెనాల్టీ పడుతుందా?;
ITR : ఈ ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి ఉన్న గడువు జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఫామ్ 16 ఇంకా రాలేదు వంటి వివిధ కారణాల వల్ల ఐటీఆర్ దాఖలు ఆలస్యం అవుతుందని భయపడుతున్న పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఊరటనిచ్చింది. అయితే, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్‌ను జులై 31 లోపే చెల్లించాలా అని కొంతమంది సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు కాబట్టి, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ చెల్లించడానికి కూడా అదే గడువు (సెప్టెంబర్ 15) వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో, జులై 31 లోపు పన్ను చెల్లించాల్సి ఉండేది. ఆ గడువు దాటితే జరిమానాతో పాటు వడ్డీ కూడా కలిపి చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు సమయం ఉంది కాబట్టి, అంతవరకు ఎలాంటి జరిమానా, వడ్డీ లేకుండా సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ చెల్లించవచ్చు.
సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ అంటే, ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మనం స్వయంగా లెక్కించి చెల్లించే పన్ను. మన మొత్తం పన్ను బాధ్యత ఎంత, టీడీఎస్ (TDS) ఎంత తగ్గించారు, అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత చెల్లించాం వంటివన్నీ లెక్కించి, చివరికి ఇంకా ఏదైనా పన్ను చెల్లించాల్సి ఉంటే, ఆ మొత్తాన్ని స్వయంగా చెల్లిస్తాం. దాన్నే సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ అంటారు. ఒకవేళ మీరు సెప్టెంబర్ 15 గడువు తర్వాత పన్ను చెల్లిస్తే, అప్పుడు నెలవారీ 1శాతం వడ్డీని కలిపి చెల్లించాల్సి వస్తుంది. ముందస్తు పన్ను లేదా అడ్వాన్స్ ట్యాక్స్‌ను చెల్లించకపోయినా, లేదా తక్కువ చెల్లించినా, ఆ డబ్బుకు కూడా నెలవారీ 1% వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
ముందస్తు పన్ను ఎవరు చెల్లించాలి?
* స్వయం ఉపాధి పొందుతున్నవారు, వ్యాపార సంస్థలు: వారి ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే, వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి.
* జీతం పొందుతున్న ఉద్యోగులు: వారి జీతం కాకుండా, ఇతర ఆదాయాలపై (ఉదాహరణకు, షేర్లు లేదా ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే క్యాపిటల్ గెయిన్, ఇంటి అద్దె ఆదాయం, ఎఫ్.డి. వడ్డీ, ఫ్రీలాన్సింగ్ ఆదాయం మొదలైనవి) చెల్లించాల్సిన పన్ను రూ.10,000 మించితే, వారు కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి.