Jio IPO: షేర్ మార్కెట్లో జియో ఐపీఓ సంచలనం.. బిజినెస్ హిస్టరీలోనే ఆల్-టైమ్ రికార్డులు బద్దలు
ఆల్-టైమ్ రికార్డులు బద్దలు
Jio IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్ఫార్మ్స్ ఇండియన్ ప్రైమరీ మార్కెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వచ్చిన ఈ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ముగియక ముందే భారత స్టాక్ మార్కెట్ రికార్డు పుస్తకాలను తిరగరాసింది. రూ.30,213 కోట్ల భారీ ఇష్యూ సైజ్‌తో వచ్చిన జియో, 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా నమోదు చేసిన రూ.27,870 కోట్ల ఐపీఓ రికార్డును అధిగమించి దేశంలోనే అత్యంత పెద్ద ఐపీఓగా అవతరించింది. ప్రతి షేరు ధరను రూ.1,065 నుంచి రూ.1,119 ప్రైస్ బ్యాండ్‌గా నిర్ణయించగా, అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద జియో ప్లాట్ఫార్మ్స్ మొత్తం మార్కెట్ విలువ రూ.10.3 లక్షల కోట్లకు చేరింది.
100 నిమిషాల్లోనే ఫుల్లీ సబ్‌స్క్రైబ్
జియో ఐపీఓ బిడ్డింగ్ బుధవారం ప్రారంభమైన కేవలం 100 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యి సంచలనం సృష్టించింది. దేశంలో ఒక మెగా ఐపీఓ ఇంత వేగంగా సబ్‌స్క్రైబ్ కావడం ఇదే ప్రథమం. బీఎస్ఈ వెబ్సైట్ గణాంకాల ప్రకారం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బైయర్స్ (QIB) కోసం కేటాయించిన వాటా బిడ్డింగ్ మొదలైన తొలి 10 నిమిషాల్లోనే పూర్తయింది. 30 నిమిషాల వ్యవధిలోనే క్యూఐబీ విభాగం 2 రెట్లు సబ్స్క్రిప్షన్ సాధించింది. ఈ రికార్డు సబ్స్క్రిప్షన్ వేగం చూసి దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు విస్తుపోయారు. ఈ ఐపీఓ పూర్తిగా 'ఫ్రెష్ ఇష్యూ' కావడం, అంటే పాత ఇన్వెస్టర్లు ఎవరూ తమ వాటాలను విక్రయించకపోవడం విశేషం.
రూ.2.5 లక్షల కోట్ల భారీ యాంకర్ బుకింగ్స్
పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే జియో మరొక ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. సంస్థకు చెందిన రూ.8,110 కోట్ల యాంకర్ బుక్ కోసం ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చిపడ్డాయి. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఇది 30 రెట్లకు పైగా ఎక్కువ కావడం గమనార్హం. భారత ఐపీఓ చరిత్రలోనే ఇది అత్యధిక యాంకర్ డిమాండ్. బ్లాక్‌రాక్, ఫిడెలిటీ, సింగపూర్ జీఐసీ, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, బీఎన్పీ పరిబాస్ వంటి దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో పాటు ఎల్ఐసీ వంటి భారతీయ దిగ్గజాలు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టాయి. దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌కు యాంకర్ బుక్‌లో 34.34 శాతం వాటా దక్కింది.
టెలికాం దాటి డిజిటల్ విప్లవం వైపు అడుగులు
ఈ ఐపీఓ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.27,500 కోట్లను సంస్థ రుణాలను చెల్లించడానికి లేదా ముందస్తుగా తీర్చివేయడానికి ఉపయోగించనుంది. జియో ప్లాట్ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కనెక్టివిటీ లేదా టెలికాం అనేది తమ వేదికపై నిర్మించిన మొదటి ప్రొడక్ట్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలను మరింత వేగంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. మెటా, గూగుల్, కేకేఆర్ వంటి అంతర్జాతీయ దిగ్గజాల భాగస్వామ్యం ఉన్న జియో ప్లాట్ఫార్మ్స్, భవిష్యత్తులో రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ. 28 లక్షల కోట్లు దాటించి నంబర్ 1 స్థానానికి చేరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.