IBC Law : ఐబీసీ చట్టంలో అతిపెద్ద మార్పులు? బ్లడ్ రిలేషన్ నిబంధన రద్దు దిశగా ప్రభుత్వం

బ్లడ్ రిలేషన్ నిబంధన రద్దు దిశగా ప్రభుత్వం

Update: 2025-11-08 07:07 GMT

IBC Law : భారతదేశంలో కార్పొరేట్ దివాలా ప్రక్రియలను నియంత్రించే ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టెసీ కోడ్‎లో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి. 2016లో అమల్లోకి వచ్చిన తర్వాత అనేక సార్లు సవరించబడిన ఐబీసీకి, ఈ శీతాకాల సమావేశాల్లో రాబోయే ఐబీసీ సవరణ బిల్లు 2025 అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా వివాదాస్పదమైన సెక్షన్ 29A లోని బ్లడ్ రిలేషన్ నిబంధనను సవరించడంపై పరిశ్రమ, న్యాయ నిపుణులు గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ మార్పు భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‎ను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించనుంది.

ఐబీసీలోని సెక్షన్ 29A దివాలా తీసిన కంపెనీ బిడ్డింగ్ ప్రక్రియలో ఎవరు పాల్గొనవచ్చు అనే దానిని నిర్ణయిస్తుంది. ఈ నిబంధన ప్రకారం కంపెనీ ప్రమోటర్లు, వారి రక్త సంబంధీకులు ఆ కంపెనీని తిరిగి సొంతం చేసుకోకుండా నిరోధించడం జరుగుతుంది. అక్రమాలకు పాల్పడిన ప్రమోటర్లు కంపెనీపై పరోక్షంగా తిరిగి నియంత్రణ సాధించకుండా నిరోధించడమే ఈ నిబంధన లక్ష్యం.

అయితే ఈ నిబంధన అత్యంత విస్తృతంగా ఉండటం వల్ల, కంపెనీ నిర్వహణలో, పెట్టుబడిలో లేదా ఆర్థిక వ్యవహారాలలో ఎలాంటి సంబంధం లేని కేవలం కుటుంబ సంబంధం ఉన్న వ్యక్తులు కూడా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించబడుతున్నారు. ఇది న్యాయంగా లేదని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు. పలు పరిశ్రమల సంఘాలు, న్యాయ నిపుణులు సెక్షన్ 29A నిబంధనను సవరించాలని గట్టిగా కోరుతున్నారు.

కేవలం కుటుంబ సంబంధం ఆధారంగా ఒకరిని బిడ్డింగ్ నుంచి తొలగించడం సరైనది కాదు. ఆ వ్యక్తికి దివాలా తీసిన కంపెనీతో ఆర్థిక సంబంధం ఉందా లేదా అనే అంశాన్ని మాత్రమే పరిశీలించాలి. ఐబీసీ సవరణ బిల్లును పర్యవేక్షిస్తున్న పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి వాటాదారులు ఇదే సూచన చేశారు.. రిలేటెడ్ పార్టీ నిర్వచనాన్ని కేవలం వ్యాపార సంబంధాలకే పరిమితం చేయాలి. బిడ్డర్ నిధులకు ప్రమోటర్‌కు డైరెక్ట్ లింక్ ఉన్నప్పుడు మాత్రమే బిడ్డింగ్‌ను ఆపాలి.

ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు కూడా సెక్షన్ 29A నిబంధనను మార్చడానికి అనుకూలంగా ఉంది. ఒక పాత తీర్పులో సుప్రీంకోర్టు రిలేటెడ్ పార్టీ గుర్తింపును కేవలం కుటుంబ సంబంధాల ఆధారంగా కాకుండా, వ్యాపార సంబంధాల ఆధారంగా నిర్ణయించాలని స్పష్టం చేసింది. కాబట్టి ప్రభుత్వం ఈ మార్పును చేస్తే న్యాయపరంగా కూడా అది బలంగా ఉంటుంది. ఐబీసీలో ఈ మార్పులు ఆమోదం పొందితే, అనేక పెద్ద కంపెనీల కుటుంబ సభ్యులు కూడా దివాలా కేసుల్లో బిడ్ వేయడానికి అర్హులు అవుతారు. దీంతో బిడ్డర్ల సంఖ్య పెరిగి, పోటీ తీవ్రమవుతుంది. ఇది దివాలా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

2016 లో అమలులోకి వచ్చినప్పటి నుండి ఐబీసీ ఇప్పటికే ఆరు సార్లు సవరించారు. ప్రతిసారీ పారదర్శకత, వేగాన్ని పెంచడమే లక్ష్యం. ప్రస్తుత మార్పు కూడా, మారుతున్న వ్యాపార వాతావరణానికి అనుగుణంగా, సెక్షన్ 29A లోని పాతబడిన నిబంధనలను సవరించి, దివాలా ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చడానికి ఉద్దేశించబడింది.

Tags:    

Similar News