Indian Railways : సడన్‌గా రైలులో జబ్బు చేస్తే ఈ నంబర్‌కు కాల్ చేయండి..ఫీజు కేవలం రూ.100మాత్రమే
ఫీజు కేవలం రూ.100మాత్రమే
Indian Railways : ప్రతిరోజూ లక్షలాది మంది భారతీయులు రైళ్లలో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. రైలు ప్రయాణం సుఖంగా ఉన్నా ఒకవేళ ప్రయాణ సమయంలో కదులుతున్న రైలులో మీకు లేదా మీ పక్కన ఉన్న ప్రయాణికుడికి అకస్మాత్తుగా అనారోగ్యం చేస్తే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఆందోళన పడటం సహజం. అయితే భారతీయ రైల్వే ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని సిద్ధం చేసింది. మీరు కదులుతున్న రైలులో కూడా డాక్టర్‌ను పిలిపించుకునే సౌకర్యాన్ని రైల్వే కల్పిస్తోంది.
రైల్వే అందించే ఈ వైద్య అత్యవసర సదుపాయం ప్రతి ప్రయాణికుడికి ఒక వరం లాంటిది. ఆరోగ్యం అకస్మాత్తుగా పాడైతే వెంటనే రైలులో ఉన్న టికెట్ చెకింగ్ స్టాఫ్, అంటే TTE (టీటీఈ) కి వెంటనే సమాచారం అందించాలి. TTE వెంటనే ఈ విషయాన్ని రైలు కంట్రోల్ రూమ్‌కు తెలియజేస్తారు. కంట్రోల్ రూమ్ అప్రమత్తమై, రైలు ఆగబోయే తరువాతి పెద్ద స్టేషన్‌లో డాక్టర్‌ను సిద్ధంగా ఉంచుతుంది. రైలు స్టేషన్‌కు చేరుకోగానే డాక్టర్ వెంటనే కోచ్‌లోకి వచ్చి, రోగిని పరీక్షించి, అవసరమైన ప్రథమ చికిత్స అందిస్తారు. ఈ సదుపాయం మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ వంటి అన్ని రైళ్లలోనూ అందుబాటులో ఉంటుంది.
రైల్వే ఇచ్చే ఈ డాక్టర్ సేవ పూర్తిగా ఉచితం కానప్పటికీ దీనికి చాలా తక్కువ రుసుము మాత్రమే వసూలు చేస్తారు. డాక్టర్‌ను పిలవడానికి రైల్వే నిర్ణయించిన నామమాత్రపు రుసుము రూ.100మాత్రమే. డాక్టర్ వచ్చి, పరీక్షించి, ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఈ ఫీజును వారికి చెల్లించాలి. డాక్టర్ మీకు ఫీజు చెల్లించినందుకు రసీదు కూడా ఇస్తారు. డాక్టర్ ఏదైనా మందులు ఇస్తే, ఆ మందుల ఖర్చు మాత్రం ప్రయాణికుడే భరించాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు ప్రయాణికులకు పెద్ద సమస్య కాకుండా, సాధారణ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు తేలికపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా ఏదైనా అలర్జీ వంటివి. ఇలాంటి చిన్న సమస్యలకు రైల్వే వద్ద మరో సదుపాయం ఉంది. ఈ సాధారణ సమస్యల కోసం కూడా మీరు ముందుగా టీటీఈకి సమాచారం ఇవ్వాలి. TTE, గార్డ్ ఉండే డబ్బాలో ఉన్న ప్రథమ చికిత్స కిట్ నుంచి మందులను తీసుకొచ్చి ప్రయాణికుడికి ఇస్తారు. ఈ మందుల కోసం ప్రయాణికుడు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు. ఈ సేవ పూర్తిగా ఉచితం.
ఈ ప్రక్రియ మరింత సులభతరం చేయడానికి, రైల్వే ఒక జాతీయ హెల్ప్‌లైన్ నెంబర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఒకవేళ మీకు అనారోగ్యం చేసినప్పుడు TTE లేదా గార్డ్ వెంటనే అందుబాటులో లేకపోతే, మీరు నేరుగా రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 138 కి కాల్ చేయవచ్చు. ఈ నెంబర్‌కు సమాచారం ఇస్తే కంట్రోల్ రూమ్‌కు తెలిసి, తరువాతి స్టేషన్‌లో వైద్య సహాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తారు. మీరు TTE కి చెప్పినా 138 కి కాల్ చేసినా రెండు విధాలుగా వైద్య సహాయం పొందవచ్చు.