MG Motors : పెట్రోల్ వద్దు.. డీజిల్ వద్దు.. ఎంజీ నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు

ఎంజీ నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు

Update: 2026-03-09 08:44 GMT

MG Motors : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న JSW ఎంజీ మోటార్ ఇండియా, ఇప్పుడు మరో భారీ విప్లవానికి సిద్ధమైంది. రాబోయే ఏడాది కాలంలో మూడు కొత్త ఎలక్ట్రిఫైడ్ ఎస్‌యూవీలను లాంచ్ చేసేందుకు కంపెనీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో కొన్ని కార్లను మన దేశంలోనే తయారు చేయనుండగా, మరికొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఎంజీ నుంచి రాబోతున్న ఆ మూడు కరెంట్ కార్ల విశేషాలేంటో వివరంగా చూద్దాం.

1. ఎంజీ IM6

ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఎంజీ నుంచి రాబోతున్న అత్యంత ఖరీదైన, స్టైలిష్ కారు MG IM6. ఇది ఒక ప్రీమియం డి-సెగ్మెంట్ ఎస్‌యూవీ-కూపే. అంటే ఇది చూడటానికి స్పోర్ట్స్ కారులా, ఎస్‌యూవీ లాగా రెండింటి కలయికతో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఇండియాలో ఇది నేరుగా టెస్లా మోడల్ Yకి పోటీ ఇవ్వనుంది. గ్లోబల్ వెర్షన్‌లో ఇది సింగిల్ మోటార్‌తో 402 BHP పవర్ ఇస్తుంది. దీని రేంజ్ ఏకంగా 625 కిలోమీటర్లు. కేవలం 3.5 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీనిని ఎంజీ సెలక్ట్ అనే ప్రీమియం షోరూమ్‌ల ద్వారా విక్రయించనున్నారు.

2. ఎంజీ 520

అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో ఎంజీ మరో పెద్ద బాంబు పేల్చనుంది. MG 520 అనే కోడ్‌నేమ్‌తో వస్తున్న ఈ కొత్త డి-సెగ్మెంట్ ఎస్‌యూవీ మన దేశంలోనే తయారవుతుంది. ఇది 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభించనుంది. దీని హైలైట్ ఏంటంటే.. ఇది కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాదు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అవతారంలో కూడా వస్తోంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. అంటే సిటీలో బ్యాటరీతో, హైవేపై పెట్రోల్ తో నడుపుకోవచ్చు. ఇది చైనాలో పాపులర్ అయిన వూలింగ్ స్టార్‌లైట్ 560 కి రీబ్యాడ్జ్ వెర్షన్ అని సమాచారం.

3. కొత్త తరం జెడ్ఎస్ ఈవీ

ఇక 2027 నాటికి ఎంజీ తన అత్యంత ప్రజాదరణ పొందిన ZS EVకి వారసుడిని తీసుకురాబోతోంది. ఈ కొత్త మోడల్ ప్రస్తుత కారు కంటే చాలా పెద్దదిగా, మరింత సౌకర్యవంతంగా ఉండబోతోంది. ఇది సరికొత్త సిగ్మా ప్లాట్‌ఫారమ్‌పై రూపొందనుంది. కేవలం ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా, దీనిని హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్లలో కూడా తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. దీనివల్ల ఎక్కువ మైలేజ్ కోరుకునే కస్టమర్లకు ఇది ఒక మంచి వరం లాంటిది.

మొత్తానికి, ఎంజీ మోటార్స్ రాబోయే కాలంలో భారతీయ కార్ల మార్కెట్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేసింది. ప్రీమియం లగ్జరీ నుంచి సామాన్యులకు అందుబాటులో ఉండే మోడళ్ల వరకు అన్ని విభాగాల్లోనూ ఎంజీ కార్లు సందడి చేయనున్నాయి.

Tags:    

Similar News