Tata Sons: టాటా సన్స్‌లో కీలక మలుపు.. లిస్టింగ్‌కు ప్రత్యామ్నాయంగా నోయల్ టాటా కొత్త ప్లాన్!
| నోయల్ టాటా కొత్త ప్లాన్!
Tata Sons: టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ భవిష్యత్తుపై కీలక చర్చ మొదలైంది. ఈ సంస్థను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాలా? లేక సంస్థ నిర్మాణంలో మార్పులు చేసి ప్రైవేట్ కంపెనీగానే కొనసాగించాలా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా నవంబర్ 26న జరిగే టాటా సన్స్ బోర్డు సమావేశంలో ప్రత్యామ్నాయ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనను పరిశీలించాలని కోరుతున్నారు. నేరుగా లిస్టింగ్ ప్రక్రియలోకి వెళ్లకుండా, ముందుగా ఈ ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ముందుంచి అభిప్రాయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు సుమారు 66 శాతం వాటా ఉంది. అందుకే ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఆర్‌బీఐ లేఖతో పెరిగిన ఒత్తిడి
టాటా సన్స్ లిస్టింగ్ అంశంపై ఆర్‌బీఐ నవంబర్ 16న కీలక లేఖ పంపింది. అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (NBFC-UL) వర్తించే అన్ని నిబంధనలను టాటా సన్స్ పాటించాలని, అందులో స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కూడా ఉందని స్పష్టం చేసింది. అక్టోబర్ 6న టాటా సన్స్ పంపిన లేఖకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ సూచన చేసింది. టాటా సన్స్ లిస్టింగ్ నిబంధన నుంచి బయటపడేందుకు గతంలో తన కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరింది. అయితే సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా లేఖతో లిస్టింగ్ బాధ్యత నుంచి తప్పించుకోవడం సంస్థకు మరింత కష్టంగా మారింది.
రెండు కంపెనీల విలీనంతో లిస్టింగ్ నుంచి తప్పించుకోవచ్చా?
టాటా ట్రస్ట్స్ ప్రతిపాదన ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థలను టాటా సన్స్‌లో విలీనం చేయాలి. ఈ రెండు సంస్థలను కలపడం ద్వారా టాటా సన్స్‌కు భారీ స్థాయిలో వ్యాపార ఆదాయం వస్తుందని, దాంతో దాని నియంత్రణ వర్గీకరణ మారే అవకాశం ఉంటుందని ట్రస్ట్స్ భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు మార్చి 31 నాటికి రూ.1.05 లక్షల కోట్ల నిర్వహణ ఆదాయం ఉండవచ్చని అంచనా. ఆర్థిక ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం రూ.40,072 కోట్లుగా ఉండొచ్చని ప్రతిపాదనలో పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో నిర్వహణ వ్యాపారాల వాటా 64.3 శాతానికి చేరుతుందని అంచనా. అలాగే గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల వాటా మొత్తం నికర ఆస్తుల్లో 88.5 శాతంగా ఉంటుందని ట్రస్ట్స్ వాదిస్తున్నాయి. ఇది కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా గుర్తించడానికి అవసరమైన 90 శాతం పరిమితి కంటే తక్కువ. ఈ మార్పులతో టాటా సన్స్ NBFC, CIC వర్గీకరణల నుంచి బయటపడవచ్చని ట్రస్ట్స్ అభిప్రాయం. అయితే దీనికి ఆర్‌బీఐ అనుమతి, సంబంధిత ఆమోదాలు అవసరం.
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు రూ.25,000 కోట్లు ఎలా?
టాటా సన్స్ ముందు మరో కీలక సమస్య కూడా ఉంది. సంస్థలో సుమారు 18.38 శాతం వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించి నిధులు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం రూ.25,000 కోట్ల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. టాటా సన్స్ తన వాటాలను తిరిగి కొనుగోలు చేసి, మూలధనాన్ని తగ్గించే విధానం ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చే అవకాశాన్ని పరిశీలించాలని నోయల్ టాటా కోరుతున్నారు. ఈ నిధుల ఏర్పాటు ఎలా సాధ్యమవుతుంది? కంపెనీపై ఎంత ఆర్థిక భారం పడుతుంది? చట్టపరంగా, నియంత్రణ పరంగా ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే అంశాలపై యాజమాన్యం పూర్తి వివరాలు బోర్డుకు అందించాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ అంశాన్ని కూడా నవంబర్ 26 సమావేశంలో చర్చకు తీసుకురావాలని భావిస్తున్నారు.
బోర్డులో భిన్నాభిప్రాయాలు
టాటా సన్స్ లిస్టింగ్ విషయంలో టాటా ట్రస్ట్స్, కంపెనీ యాజమాన్యం మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ట్రస్ట్స్ మాత్రం సంస్థ ప్రైవేట్ హోదాను కొనసాగించాలని కోరుకుంటున్నాయి. మరోవైపు ఆర్‌బీఐ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత బోర్డుపై ఉందని కంపెనీ వర్గాల వాదనగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే నుంచి కూడా కంపెనీ న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నవంబర్ 26న జరిగే బోర్డు సమావేశం కీలకంగా మారింది. టాటా సన్స్ లిస్టింగ్ దిశగా అడుగులు వేస్తుందా? ట్రస్ట్స్ ప్రతిపాదించిన విలీన ప్రణాళికను పరిశీలిస్తుందా? షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నిధుల అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం వెలువడలేదు.