RBI : బ్యాంకుల్లో మోసాలకు చెక్.. ఇన్సూరెన్స్, ఎన్‌పీఎస్ అమ్మకాలపై ఆర్‌బీఐ ఉక్కుపాదం
ఇన్సూరెన్స్, ఎన్‌పీఎస్ అమ్మకాలపై ఆర్‌బీఐ ఉక్కుపాదం
RBI : బ్యాంకులకు వెళ్లినప్పుడు లోన్లు, డిపాజిట్ల కంటే ఎక్కువగా ఇన్సూరెన్స్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ఎన్‌పీఎస్ వంటి ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్టుల గోల ఎక్కువైపోయింది. కస్టమర్ల అవసరంతో సంబంధం లేకుండా, టార్గెట్ల కోసం బ్యాంక్ సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చి వీటిని అంటగడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ మిస్-సెల్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఉక్కుపాదం మోపింది. కస్టమర్లను మోసం చేసే బ్యాంకుల ఆటలు సాగవంటూ సరికొత్త కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.
మాయమాటలతో అమ్మితే కుదరదు
బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ప్రొడక్టులు అమ్మే విధానంపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలిచ్చింది. బ్యాంక్ బ్రాంచ్ లోపల పని చేసే బ్యాంక్ సిబ్బందికి, ఇన్సూరెన్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ అమ్మే ఏజెంట్లకు మధ్య స్పష్టమైన తేడా ఉండాలి. ఏజెంట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బ్యాంక్ ఉద్యోగులమని చెప్పుకోకూడదు. కస్టమర్ల నుంచి అనుమతి తీసుకోకుండా వారికి ఫోన్లు చేయడం లేదా నేరుగా కలవడం చేయకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రతి బ్యాంక్ ఒక సేల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయాలి, దీన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవు.
సమ్మతి తప్పనిసరి.. షరతులు స్పష్టంగా
చాలా సందర్భాల్లో బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని నిబంధన పెడతాయి. కానీ ఇకపై అలా కుదరదు. ప్రతి సర్వీస్‌కు విడివిడిగా కస్టమర్ అనుమతి తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ఒకే సంతకంతో అంటగట్టకూడదు. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్‌లలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా కస్టమర్లు అగ్రీ బటన్ నొక్కకుండా ఉండేలా ఇంటర్‌ఫేస్ డిజైన్ చేయాలి. థర్డ్ పార్టీ ప్రొడక్టులను బ్యాంక్ సొంత ప్రొడక్టులుగా ప్రచారం చేయడంపై కూడా నిషేధం విధించారు.
కస్టమర్ ప్రొఫైల్ ముఖ్యం
ఒక కస్టమర్ వయసు, ఆదాయం, రిస్క్ తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా వారికి పనికిరాని పాలసీలను అమ్మడాన్ని మిస్-సెల్లింగ్ అంటారు. ఉదాహరణకు.. మ్యూచువల్ ఫండ్ అని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీలను (ULIPs) అమ్మడం ఇకపై సాగదు. కస్టమర్ సంతకం చేశారు కదా అని బ్యాంకులు బాధ్యత నుంచి తప్పుకోలేవు. కస్టమర్ ప్రొఫైల్ కు సరిపోని ప్రొడక్ట్ అమ్మినట్లు రుజువైతే, బ్యాంకులు ఆ మొత్తాన్ని రీఫండ్ చేయడమే కాకుండా, నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
అమ్మిన తర్వాత సర్వే.. ఫిర్యాదుకు అవకాశం!
ఏదైనా ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అమ్మిన 30 రోజుల లోపు కస్టమర్ నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఫీడ్‌బ్యాక్ రిపోర్టును రివ్యూ చేయాలి. కస్టమర్లు తమకు జరిగిన అన్యాయంపై 30 రోజుల లోపు బ్యాంక్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం ఇవి డ్రాఫ్ట్ మార్గదర్శకాలు మాత్రమే. వీటిపై ప్రజల నుంచి సూచనలు తీసుకున్న తర్వాత, జూలై 1, 2026 నుండి తుది నిబంధనలు అమలులోకి వస్తాయి.