Gold: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారాథాన్ ఫ్యూషన్ అనే స్టార్టప్ కంపెనీ ప్రయోగశాలలో పాదరసంతో స్వచ్ఛమైన బంగారం తయారు చేశామని ప్రకటించి సంచలనం సృష్టించింది. న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యూటేషన్ అనే అధునాతన అణు విజ్ఞాన సాంకేతికత ద్వారా ఈ ప్రక్రియను సాధ్యం చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్యూజన్ రియాక్షన్ ద్వారా విడుదలయ్యే పవర్ ఫుల్ న్యూట్రాన్‌లను ఉపయోగించి మెర్క్యురీ-198 మూలకాన్ని స్థిరమైన బంగారంగా మారుస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రయోగానికి సంబంధించిన శాస్త్రీయ డేటాను లేదా ఎంత బంగారం తయారైందనే వివరాలను కంపెనీ పూర్తిగా బయటపెట్టలేదు.

చరిత్రలో ఇలాంటి ప్రయోగాలు జరిగాయా?

ల్యాబ్‌లో బంగారం తయారు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఐరోపాకు చెందిన ప్రతిష్టాత్మక CERN ప్రయోగశాలలో కూడా లార్జ్ హ్యాడ్రాన్ కొల్లాయిడర్(LHC) ద్వారా సీసం అణువులను ఢీకొట్టి అతి చిన్న బంగారు కేంద్రకాలను సృష్టించారు. అయితే ఆ ప్రయోగంలో తయారైన బంగారం కేవలం కొన్ని పికో గ్రాముల పరిమాణంలో మాత్రమే ఉండి క్షణాల వ్యవధిలో ఆవిరైపోయింది. కానీ మారాథాన్ ఫ్యూషన్ సంస్థ మాత్రం వాణిజ్య స్థాయిలో పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ బంగారం ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. భవిష్యత్తులో ఇది నిజమైతే గనుల నుంచి బంగారం వెలికితీసే అవసరం తగ్గొచ్చని భావిస్తున్నారు.

బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ప్రయోగశాలలో బంగారం తయారవుతున్న వార్తలు వస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి ఇది మార్కెట్ ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ మార్కెట్‌ను ప్రభావితం చేసినట్లుగా బంగారాన్ని తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం అంత సులభం కాదు. ఇందులో రేడియోధార్మికత సవాళ్లు, భారీ ఉత్పత్తి వ్యయం వంటి అనేక అడ్డంకులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ సహజ బంగారం గనుల ద్వారా ఉత్పత్తి అవుతున్న తరుణంలో, ల్యాబ్ గోల్డ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.

శాస్త్రీయంగా ఈ ప్రయోగం ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడానికి ఇది తక్షణ కారణం కాదు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరల పెరుగుదల మరియు తగ్గుదల పూర్తిగా అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితులు, ద్రవ్యోల్బణంపైనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మదుపర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ వాణిజ్య రూపం దాల్చిన తర్వాతే దీని ప్రభావం మార్కెట్‌పై ఎంత ఉంటుందనేది స్పష్టమవుతుంది.

Tags: